రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ను భయభ్రాంతులకు గురి చేసిన కేటుగాళ్లు
రూ.1.44 కోట్లు కొట్టేసిన సైబర్ నేరస్తులు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ను భయభ్రాంతులకు గురి చేసి, అందినకాడికి దోచుకున్నారు సైబర్ నేరస్తులు. ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులుగా పేర్కొంటూ 76 ఏళ్ల వృద్ధుడిని నట్టేట ముంచేశారు. ఈమేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్‌కు జనవరి 17న గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
తాను ముంబై ఏటీఎస్ నుంచి పరిచయం చేసుకున్న సైబర్ నేరస్తుడు.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినందుకు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ ఫోన్ కాల్ ఏటీఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న సులేక్ కుమార్, ముఖేష్ వర్మ, అజయ్ కుమార్ బన్సాలీలకు బదిలీ అయింది. అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకర్తలతో ముడిపడి ఉన్న బహుళ బ్యాంకు ఖాతాలను తెరవడానికి నా ఆధార్ కార్డ్ వివరాలను వినియోగించారని తెలిపారు.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి, ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును తొలగించాలంటే బ్యాంక్ ఖాతా వివరాలను ధ్రువీకరించాలని సూచించారు. దీంతో నిందితుల సలహా మేరకు బాధితుడు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19 మధ్యకాలంలో నేరస్తులు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు 13 లావాదేవీల్లో రూ.1.44 కోట్లను బదిలీ చేశాడు. ఆ తర్వాత నుంచి నిందితులతో ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు లేకపోయేసరికి మోసపోయాననిగ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.


