ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం | Moosi River Revival Works to Begin from Ugadi | Sakshi
Sakshi News home page

ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం

Feb 27 2026 1:46 AM | Updated on Feb 27 2026 1:46 AM

Moosi River Revival Works to Begin from Ugadi

టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద జేసీబీలతో పనులు కొనసాగిస్తున్న దృశ్యం

సన్నాహాలు చేస్తున్న ఎంఆర్డీసీఎల్‌ అధికారులు 

గాంధీ సరోవర్‌ వద్ద అభివృద్ధి పనులు ప్రారంభం 

బుద్వేల్‌–కోస్గి వరకు నూతన రేడియల్‌ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన 

సాక్షి, హైదరాబాద్‌ /లంగర్‌హౌస్‌: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి మూసీనది అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్డీసీఎల్‌) అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలిదశలో హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు అలాగే ఉస్మాన్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు 20 కిలోమీటర్ల మేర సుందరీకరణ చేయనున్న సంగతి తెలిసిందే. తొలి దశకు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేయగా.. ఇందులో రూ.4,100 కోట్ల రుణాన్ని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అందించనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. 

బుద్వేల్‌ టు కోస్గి 
గాంధీ సరోవర్‌తోపాటు బుద్వేల్‌–కోస్గి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో రాబోయే 81 కి.మీ., 4 లేన్ల (భవిష్యత్‌లో 6–లేన్లు) ఈ రేడియల్‌ రోడ్డు.. ఔటర్‌ ఎగ్జిట్‌ 17 బుద్వేల్‌ నుంచి కోస్గిని కలుపుతుంది. ఇది ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌), ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ట్రిపుల్‌ ఆర్‌)లను అనుసంధానిస్తుంది. ఈ రహదారి ప్రధానంగా చందనవెల్లి, పేరారం వంటి పారిశ్రామిక ప్రాంతాల గుండా వెళుతుంది. 

ఇక్కడే గాంధీ సరోవర్‌ 
గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు లంగర్‌హౌస్‌ బాççపూఘాట్‌ వద్ద నిర్మించనున్నారు. హైదర్షాకోట్‌లోని ఆర్మీ పాఠశాల మీదుగా టిప్పుఖాన్‌ బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిని ఆర్మీ పాఠశాల వద్ద మూసివేసి నేరుగా తీసుకెళ్లి నూతన బ్రిడ్జి నిర్మించి నార్సింగి రోడ్డుకు కలపనున్నారు. ఇక్కడి నుంచి మొదలై లంగర్‌హౌస్‌లోని బాçపూఘాట్‌ దగ్గరలో ఉన్న నాలా వరకు గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ శాఖకు చెందిన 52 ఎకరాల స్థలం ఉంది.

ఆ భూమిని బదిలీ చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరగా.. 38.09 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఈ మిలటరీ ప్రాంతంతోపాటు ప్రభుత్వ భూమిలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న త్రివేణి సంగమం వద్ద చెట్లు తొలగించి, చదును చేస్తున్నారు. గురువారం టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టు ప్రారంభ ప్రాంతం, నూతన అధునాతన స్ప్రింగ్‌ బ్రిడ్జి నిర్మించున్న ప్రాంతాల్లో జేసీబీలతో చెట్లను తొలగిస్తూ అధికారులు పనులు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement