100 పబ్లిక్‌ స్కూళ్లు | CM Revanth Reddy announces Public Schools in 100 constituencies: Telangana | Sakshi
Sakshi News home page

100 పబ్లిక్‌ స్కూళ్లు

Feb 27 2026 1:06 AM | Updated on Feb 27 2026 1:06 AM

CM Revanth Reddy announces Public Schools in 100 constituencies: Telangana

శిక్షణకు సంబంధించిన ఫొటో ప్రదర్శన తిలకిస్తూ ఓ యువ అధికారితో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్‌

ఈ ఏడాది నుంచే ప్రారంభించాలి.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌

పైలెట్‌ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలి... ఇవి అన్ని విధాలా ‘ఆరుట్ల స్కూల్‌’ మాదిరిగానే ఉండాలి 

కార్పొరేట్‌ తరహాలో ‘క్యూర్‌’ పరిధిలోని పాఠశాలలు... పాఠశాల స్థాయి నుంచే  కృత్రిమ మేధపై బోధన 

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌... స్కూల్‌ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, డిక్షనరీ, బూట్లు, సాక్సులతో కిట్‌   

ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తామన్న సీఎం 

రాష్ట్ర విద్యా కమిషన్‌ నివేదిక పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది నుంచి తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ళను (టీపీఎస్‌లు) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ తరహాలోనే వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం నగరంలోని కమాండ్‌  కంట్రోల్‌ సెంటర్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యా కమిషన్‌ చేసిన సిఫారసులపై స్పందించారు. టీపీఎస్‌ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.  

సాంకేతికతతో ‘క్యూర్‌’ స్కూళ్లు 
‘కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌  తరహాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. ఏడాదిలో క్యూర్‌ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్‌ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలి. నగరంలోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో ఉండాలి.

క్యూర్‌లో అప్‌గ్రేడ్‌ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వ సతులు కల్పించనున్న 164 పాఠశాలలకు సంబంధించిన పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదు. ప్రభుత్వఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారంరోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతు ల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

2026–2027 నుంచి బ్రేక్‌ ఫాస్ట్, పాలు 
‘ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలి. ఏఐపై బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలి. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌ అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలి. (ఈ పథకం అమలుకు సంబంధించి హరేకృష్ణ మిషన్‌ ప్రతినిధులకు సీఎం పలు సూచనలు చేశారు). బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రతి విద్యారి్థకి పాలు అందజేయాలి. పాలను విజయ డెయిరీ నుంచి సేకరించాలి. విద్యార్థులకు ఎన్ని కేలరీలు అందజేస్తున్నామో తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.  

ఈ ఏడాది నుంచి విద్యార్థులకు కిట్‌ 
    పాఠశాల విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి ఒక కిట్‌ అందజేయాలి. అందులో స్కూల్‌ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్‌లో పొందుపర్చేలా చూడాలి. అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయిస్తాం..’ అని సీఎం తెలిపారు. అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని సీఎం ఆదేశించారు.  

ఫీజులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి 
 ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల విధానం,  తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమరి్పంచాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.  ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను ప్రజలకు అందుబాటులో (పబ్లిక్‌ డొమైన్‌లో) ఉంచాలని సూచించారు.  

కేకే కమిటీ కమిషన్‌ నివేదిక పరిశీలించాలి 
 తెలంగాణ విద్యా విధానంపై రాష్ట్ర విద్యా కమిషన్‌ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. నివేదికలోని చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన, ఇంటర్మిడియెట్‌ బోర్డు డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్‌ ధోత్రే, పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికొలస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement