హైదరాబాద్‌కు ‘హార్వర్డ్‌’ | CM Revanth Reddy Participates In Group 1 and Group 2 Officers Training Valedictory Ceremony | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు ‘హార్వర్డ్‌’

Feb 27 2026 1:13 AM | Updated on Feb 27 2026 1:13 AM

CM Revanth Reddy Participates In Group 1 and Group 2 Officers Training Valedictory Ceremony

అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గ్రూప్‌ ఫొటో

గ్రూప్‌–1, 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూని వర్సిటీ హైదరాబాద్‌కు రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ప్రాంగణంలో ప్రత్యేకంగా స్టడీ సెంటర్‌ను తెరవనుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీతో హార్వర్డ్‌ యూనివర్సిటీ త్వరలో అవగాహన కుదుర్చుకోనుందని వివరించారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన గ్రూప్‌–1, గ్రూప్‌–2 అధికా రుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రకరకాల కోర్సులు..సర్టిఫికెట్లు
‘అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థిగా చేరి ఒక కోర్సు పూర్తి చేశా. రోజుకు 12 గంటల పాటు తరగతులకు హాజరయ్యా. ఆ గొప్ప విశ్వవిద్యాల యాన్ని హైదరాబాద్‌కు తీసుకురావాలని సంకల్పించా. వర్సిటీ యాజమాన్యంతో చర్చించా. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీతో అవగాహన తర్వాత ఇక్కడే ఒక స్టడీ సెంటర్‌ను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాం. వివిధ రకాల ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు ఇక్కడ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చేరవచ్చు. ఇక్కడే తరగతులకు హాజరు కావొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించిన మీరు కూడా ఈ కోర్సులు చేయవచ్చు..’ అని సీఎం తెలిపారు. 

తెలంగాణ ప్రజలు ఆధిపత్యం సహించలేరు..
‘మీరు ఎంతో కష్టపడి, లక్షలాది మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు. మీరు మొన్నటివరకు విద్యార్థులు..నిన్నటివరకు నిరుద్యోగులు..ఈ రోజు అధికా రులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రజాపాలనలో మీరంతా ప్రజలకు నేరుగా సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని సహించలేరు. రాంజీ గోండ్, కుమ్రుంభీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపై తిరు గుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క, సారల మ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వన దేవతలుగా గౌరవించబడుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులయ్యారు. 

బాధ్యత మరవొద్దు.. పతనం కావొద్దు
అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మీరంతా ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తిని ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలి. 2011 తర్వాత 14 ఏళ్ల పాటు గ్రూప్‌–1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్‌–1 నిర్వహించి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. తొలుత టీజీపీఎస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. డీజీపీగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించాం. రిజిస్ట్రార్, ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించాం. ప్రశ్న పత్రాలు జిరాక్స్‌ సెంటర్‌లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. కొందరు గిట్టనివాళ్లు కోర్టులకెక్కి ఉద్యోగాలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అన్ని కోర్టుల్లో అభ్యర్థుల తరఫున బలంగా వాదించి కోర్టులను ఒప్పించి ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాం. అధికారులుగా మారిన తర్వాత బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావొద్దు..’ అని రేవంత్‌ చెప్పారు. 

తల్లిదండ్రులకు అండగా ఉండండి..
‘సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీపైనే ఉంది. మీరంతా ఆఫీసుకు వెళ్ళేముందు ఎస్‌ఆర్‌ శంకరన్‌ను తలుచుకోవాలి. పేదవారికి సాయం చేసే విషయంలో మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవండి. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా త్వరలో చట్టం చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు కొత్త అధికారుల శిక్షణకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను రేవంత్‌ తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement