వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్
కుమ్మెర ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాం
గ్రామ వాట్సప్‌గ్రూప్‌లో పోస్టింగ్‌తో జాతరలో గణేశ్‌పై దాడి
నాగర్‌కర్నూల్‌లో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్‌కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న కుమ్మెర జాతరలో దాడి జరిగిన సమయంలో డయల్ 100కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించామన్నారు. ముందుగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి తలకు గాయమైందని గణేశ్‌పై ఫిర్యాదు ఇచ్చారని, దీంతో కేసు నమోదు చేశామన్నారు. అలాగే గణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై మరో కేసు పెట్టామని చెప్పారు.
అయితే ఘటన రోజు ఇచ్చిన ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై మాత్రమే దాడి గురించి ప్రస్తావించారని, మౌనిక, పాపపై దాడి జరిగినట్టుగా ఫిర్యాదులో లేదన్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ నెల 21న ఉదయం పాప మరణించిందని చెప్పారు. జనరల్ ఆస్పత్రిలో పాపకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నెల 17న జాతరలో తల్లి చంద్రకళను శ్రీనివాస్‌రెడ్డి తిట్టాడని.. శ్రీనివాస్‌రెడ్డిని దూషిస్తూ గ్రామ వాట్సప్ గ్రూప్‌లో గణేశ్ ఆడియో పోస్టు చేశాడు. గ్రూప్‌లో ఎందుకు పోస్టు చేశావంటూ గణేశ్‌ను ప్రశ్నిస్తూ శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 8 మంది గణేశ్, చంద్రకళపై దాడికి దిగినట్టు వివరించారు.
8మందిపైకేసు... ముగ్గురు రిమాండ్
నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గత డిసెంబర్ 21న 1.44 కిలోల బరువుతో పాప జన్మించినట్టు ఎస్పీ చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఎన్‌ఐసీయూలో చికిత్స పొందిందన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో 30 రోజులపాటు చికిత్స పొందినట్టు చెప్పారు. రెస్పిరేటరీ, జాండీస్, న్యూమోనియా సమస్యలున్నట్టు గుర్తించామన్నారు. అయితే పాప మరణానికి సంబంధించి ఫోరెన్సిక్, విస్త్రా రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. కుమ్మెర జాతరలో మౌనికతోపాటు ఆమె బిడ్డపై దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, ఇప్పటికే దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని రిమాండ్‌కు పంపామని వివరించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
బాధితుల ఆచూకీ లేదు: నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్
కుమ్మెర ఘటనలో దాడికి గురైన బాధిత కుటుంబం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత అక్కడి టెంట్లు, వేదికను సైతం తొలగించారు. దీనిపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ బాధిత కుటుంబం తమకు సమాచారం ఇవ్వకుండా కారులో వెళ్లిపోయారని చెప్పారు. బీసీ జేఏసీ, డీఎస్పీ నాయకులు సాయి, రఘు వారిని కారులో తీసుకువెళ్లారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించేందుకు బాధిత కుటుంబం వెళ్లినట్లు సమాచారం.
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
కుమ్మెర జాతరలో దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయగా కమిషన్ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి యాక్షన్ టోకెన్ రిపోర్టును తమకు నాలుగు వారాల్లో అందించాలని కలెక్టర్, ఎస్పీలకు నోటీసు జారీ చేసింది.


