ఫ్రం తడోబా.. విత్‌ లవ్‌! | Tiger Movement Confirmed in Kodimyala Forest: Telangana | Sakshi
Sakshi News home page

ఫ్రం తడోబా.. విత్‌ లవ్‌!

Feb 27 2026 5:42 AM | Updated on Feb 27 2026 5:42 AM

Tiger Movement Confirmed in Kodimyala Forest: Telangana

తోడు కోసం తడోబా నుంచి వచ్చిన పెద్దపులి.. ప్రస్తుతం నిజామాబాద్‌ సరిహద్దుల్లో  

యాదాద్రి వరకు వచ్చి మళ్లీ వెనక్కి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. జోడి కోసం వెతుకుతున్న ఈ మగ పులి నిజామాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ పెద్దపులి మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని జన్నారం మీదుగా సంచరిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి, తిరిగి మళ్లీ సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా మీదుగా జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించింది. వేములవాడ ప్రాంతంలో ఒక ఆవును చంపేసింది. ఈ మగ పులి సుమారు 250 కిలోల బరువు ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. దీనికి జే–1 అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అటవీ అధికారులుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

కదలికలు గమనించేందుకు ట్రాకర్లు 
పెద్ద పులి నిజామాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతం వైపు వచ్చే అవకాశాలు ఉండడంతో దాని కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు ఖానాపూర్‌ నుంచి నలుగురు ట్రాకర్లను జిల్లాకు రప్పించారు. ఆయా ట్రాకర్ల ఆధ్వర్యంలో ఇందల్వాయి రేంజ్‌లో రెండు బృందాలు, కమ్మర్‌పల్లి రేంజ్‌లో ఒక బృందం, సిరికొండ రేంజ్‌లలో మరొక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రస్తుతం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ చేస్తున్నాయి. గతంలో కామారెడ్డి వరకు వచ్చి సిరికొండ రేంజ్‌ మీదుగా వెళ్లిన పెద్దçపులి, ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లా సరిహద్దులో తిరుగుతున్న పెద్ద పులి వేర్వేరు అని అటవీ అధికారులు స్పష్టం చేశారు.

ఈ పులి రోజుకు 20 కిలోమీటర్లు తిరుగుతోందని, జిల్లా సరిహద్దుల్లోకి, జిల్లా లోపలికి సైతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు. కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్‌లలోని అడవుల్లోకి పశువులు, మేకల కాపర్లు వెళ్లకూడదని అధికారులు ప్రకటన చేశారు. నిజామాబాద్‌ జిల్లా అటవీ అధికారి వికాస్‌ మీనా మాట్లాడుతూ ట్రాకర్లతో కలిసి పెట్రోలింగ్‌ చేయిస్తున్నామని, అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు, సరిహద్దు గ్రామాల ప్రజలు వెళ్లొద్దని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement