సింగరేణి బొగ్గులో నాణ్యత లేదు...ఉత్పత్తి అంతంతే
కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్‌కు వెళ్దాం
ప్రభుత్వానికి జెన్‌కో ప్రతిపాదన.. ఇతర రాష్ట్రాలకు ఆపేసి బొగ్గు ఇస్తామన్న సింగరేణి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గుపై విశ్వాసం సన్నగిల్లుతోందని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. యాదాద్రి థర్మల్ ప్లాంట్లను వేసవి నాటికి పూర్తిస్థాయిలో వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలన్నది జెన్‌కో లక్ష్యం. ఈ నేపథ్యంలో జెన్‌కోకు రోజుకు లక్ష టన్నుల బొగ్గు అవసరం. ఈ మొత్తాన్ని సింగరేణి నుంచి సమకూర్చుకోవడం సాధ్యం కాదని జెన్‌కో అంటోంది. పైగా సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు రావడం లేదని, కోల్ ఇండియా బొగ్గు కన్నా ధర ఎక్కువగా ఉంటోందని చెబుతోంది.
యాదాద్రికి అవసరమైన మేర బొగ్గు అందించలేమని సింగరేణి ఇటీవల జెన్‌కోకు లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం సింగరేణితో చర్చించగా, ఇతర రాష్ట్రాలకు నిలిపేసి తెలంగాణ జెన్‌కోకు బొగ్గు ఇస్తామని సింగరేణి భరోసా ఇచి్చంది. కానీ జెన్‌కో మాత్రం దీనిపై అసంతృప్తితో ఉంది. నాణ్యమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయం అవసరమని జెన్‌కో అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. వేసవి డిమాండ్‌ను తట్టుకోవాలంటే యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కీలకమని జెన్‌కో చెబుతోంది.
నాణ్యత ఏదీ?
కొన్నేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. అదీగాక నాణ్యమైన బొగ్గు కూడా రావడం లేదు. గరిష్టంగా 3500 ఉష్ణశక్తి (జీసీవీ) ఇచ్చే బొగ్గు రావడమే కష్టంగా ఉందని జెన్‌కో అంటోంది. 4500 జీసీవీపైన ఉంటే తప్ప కొత్త ప్లాంట్లు నడపలేని స్థితి ఉంది. తరచూ బ్యాకింగ్ డౌన్ వల్ల ఉత్పత్తి తగ్గి భారం ఎక్కువవుతోందని చెప్పింది. జెన్‌కో సహా ఇప్పటి వరకూ 21 పరిశ్రమలు సింగరేణి బొగ్గుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 20 పరిశ్రమలు ఇప్పటికే బొగ్గు కొనుగోలు నిలిపివేశాయి. జెన్‌కో కూడా సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉందని భావిస్తోంది. టన్ను రూ. 4 వేలకు లభించే బొగ్గును కొన్ని సార్లు రూ. 7 నుంచి 8 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని తెలిపింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, ఇప్పటికే మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తోందని ప్రభుత్వానికి చెప్పింది.
తగ్గిన బొగ్గు ఉత్పత్తి
అవసరాలకు తగ్గట్టు బొగ్గు అందించడంలో సింగరేణి వెనుకబడుతోంది. కొత్త బ్లాక్‌లను చేజిక్కించుకోలేని పరిస్థితి, ఉన్న బ్లాకుల్లోనూ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి సింగరేణిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2021–22లో 65.53 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి రవాణా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత డిసెంబర్ వరకూ 51.47 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యమైతే 43.73 మిలియన్ టన్నులకే పరిమితమైంది.
బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు తరచూ బొగ్గు సరఫరా అనుకున్న సమయంలో చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో కోల్ ఇండియా, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు తీసుకోవాలనే ప్రతిపాదనను జెన్‌కో ముందుకు తెస్తోంది. సింగరేణి మాత్రం ఇతర రాష్ట్రాలకు నిలిపివేసి బొగ్గు అందిస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.


