విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్‌కే బౌలర్ రామకృష్ణ ఘోష సంచలన ప్రదర్శనలతో చెలరేగిపోతున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజృంభించిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్.. తాజాగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఊహకందని గణాంకాలు నమోదు చేశాడు.
ప్రత్యర్ది గెలుపుకు చివరి 3 ఓవర్లలో 11 అవసరమైన దశలో 48వ ఓవర్, 50వ ఓవర్‌ను మెయిడిన్ చేసి, తన జట్టును అపురూప విజయాన్ని అందించాడు. ఘోష్ నమోదు చేసిన ఈ గణాంకలు చూసి సీఎస్‌కే అభిమానులు ఔరా అంటున్నారు. తమ ఫ్రాంచైజీకి మరో మ్యాచ్ విన్నర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.
ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్‌కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల ఘోష్ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అయినా సీఎస్‌కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకానికి ఘోష్ న్యాయం చేస్తున్నాడు. ఘోష్ లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్‌లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.
ఆదుకున్న రుతురాజ్
మహారాష్ట్ర-గోవా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.
131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతనికి విక్కీ ఓస్త్వాల్ (53), రాజవర్దన్ హంగార్గేకర్ (32 నాటౌట్) సహకరించారు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.
ఛేదనలో విజయం దిశగా సాగిన గోవా.. రామకృష్ణ ఘోష్ ధాటికి చివర్లో చిత్తైపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఘోష్ సహా ప్రశాంత్ సోలంకి (10-1-56-4) సత్తా చాటి గోవాను ఇరుకున పెట్టాడు.


