నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్ అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్ టర్న్ మధ్య వారి చిరకాల ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు.
ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-
కేరళలోని కొల్లం ముందక్కల్‌కు చెందినవారు జయప్రకాష్, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.
ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు. దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు.
షార్ట్ ఫిలిం కలిపిన ప్రేమ
భర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు.
మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి సందడి వేళ అయ్యింది.

పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?" అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.
ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!


