అనిక్టస్ లంకమల్లెన్సిస్ జాతి
తూర్పు కనుమల్లో రెండు జాతులకు చెందిన ఆర్మీ చీమలను కనుగొన్నారు. కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, ప్రియదర్శనన్, ఒడిశాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్(నైసర్) పరిశోధకులు బికాశ్ సాహు, నిఖితా కుమారన్, అనిరుద్ధ దత్తారాయ్ తమ పరిశోధనలో ఈ చీమలను గుర్తించారు. ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో అనిక్టస్ చిట్టోరెన్సిస్, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో అనిక్టస్ లంకమల్లెన్సిస్ రకానికి చెందిన చీమలను గుర్తించారు. ఈ ఆర్మీ చీమలు సంచార జాతులు.
ఇవి నిర్వహించే సామూహిక మేత దాడులు ఇతర కీటకాలు, పక్షులు, బల్లులకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడతాయి. ఇవి పర్యావరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇవి ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో కనిపించే అత్యంత సంచార మాంసాహారులు. వాటి శరీరాలతో తాత్కాలిక బయోవాక్స్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. సామాజిక కీటకాలుగా అవి భారీ కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి.
ఇవి దండెత్తి కీటకాలు, ఇతర చిన్న కీటకాలను తింటాయి. పెద్ద, పదునైన కోరలతో కుట్టగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటివరకు పరిశోధన, అధ్యయనాల ఆధారంగా దేశంలో 38 రకాల ఆర్మీ చీమలను గుర్తించారు. ఇప్పుడు ఈ రెండు కొత్త జాతులను కనుగొనడంతో ఆర్మీ చీమల జాతుల సంఖ్య 40కి చేరుకుందని కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, జీవ వైవిద్య పరిశోధకులు మంజునాథ్ ఎస్ నాయక్ తెలిపారు.


