మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు, కౌలు రైతు సంఘం ప్రతినిధులు
అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి
భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులివ్వాలి
పంట రుణాలు, నష్టపరిహారం, బీమా మొత్తం కౌలు రైతులకే ఇవ్వాలి
రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి
బెజవాడలో ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో 30 గంటల నిరవధిక దీక్ష
ప్రారంభించిన మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు
చంద్రబాబు సర్కారుపై కౌలు రైతులు సమరభేరి మోగించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సాగుదారులను ఆదుకోవాలని గర్జించారు. రాష్ట్ర నడిబొడ్డున 30 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. అన్నదాతా సుఖీభవ వర్తింపజేయాలని, భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ అమలు చేయాలని నినదించారు.
గాందీనగర్(విజయవాడసెంట్రల్): వ్యవసాయ రంగానికి ఎంతో చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటున్నాయని, వాస్తవానికి అవి చెప్పేదానిలో పది శాతం కూడా చేయడం లేదని అఖిల భారత కిసాన్ మోర్చా రాష్ట్ర కనీ్వనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ వర్తింపజేసి రూ.20 వేలు ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలగించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు, నష్టపరిహారం, బీమా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో 30 గంటల నిరవధిక దీక్షను సోమవారం కౌలు రైతులు చేపట్టారు. ఈ దీక్షను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ యజమానుల కన్నా కౌలు రైతులే అధిక శాతం భూములను సాగు చేస్తున్నారని తెలిపారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కౌలు రైతులు ఎంతగా శ్రమిస్తున్నా అప్పులే మిగులుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల్లో 24 శాతం మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారని వెల్లడించారు. నూటికి రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటువంటి భూమిగానీ, తోటి రైతు సంతకంతో గానీ పని లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వొచ్చని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని వడ్డే ధ్వజమెత్తారు. బడా వ్యాపారులకు రుణాలు ఇచ్చి లక్ష్యాలను పూర్తి చేస్తున్నారే తప్ప రైతులు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కౌలు రైతులు పంటలు సాగు చేయకపోతే ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు ఒక పర్యాయం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన బోనస్ ఇవ్వకూడదంటూ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. రైతులకు, కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయస్థానాల్లోనూ న్యాయ పోరాటం చేయాలని పేర్కొన్నారు.
హామీల అమలేదీ?
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంతకం తొలగించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనం కౌలు రైతులకే చెందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటూ, ఎకరం 99 పైసల వంతున బడా కార్పొరేట్లకు కేటాయించడానికి భూములు ఎవడబ్బ సొమ్మని నిలదీశారు. రైతులను పట్టించుకోకపోతే ఇంటిదారి పట్టిస్తారని కూటమి నేతలను హెచ్చరించారు. దీక్షలో కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు టి.వి.లక్ష్మణస్వామి, పంచకర్ల రంగారావు, జె.వెంకటేశ్వరరావు, జి.సీతారెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


