గుంతకల్లులో దొంగల బీభత్సం | Robbers Loot Gold, Silver, And Cash Worth Lakhs In Guntakal, Clash With Victims And Police | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో దొంగల బీభత్సం

Feb 24 2026 4:07 AM | Updated on Feb 24 2026 12:13 PM

Theft in railway employees houses: Anantapur district

దుస్తులు, వస్తువులు బయట పడేసిన దృశ్యం

నలుగురు రైల్వే ఉద్యోగుల ఇళ్లల్లో చోరీ 

86 తులాల బంగారం, 2.05 కిలోల వెండి, రూ.3.70 లక్షల నగదు అపహరణ  

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక రైల్వేకాలనీలోని నాలుగు క్వార్టర్స్‌లలో దొంగతనం చేశారు. తాళాలు వేసి ఉన్న ఆ ఇళ్లల్లోంచి మొత్తం 86 తులాల బంగారం, 2.05 కిలోల వెండి, రూ.3.70 లక్షల నగదు అపహరించారు. పట్టుకునేందుకు వెంటాడిన బాధితులు, పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడిచేసి దొంగలు పరారయ్యారు. గుంతకల్లులో రైల్వే డబుల్‌ క్వార్టర్స్‌లో రైల్వే ఉద్యోగులు నాగరాజు, నరసింహారెడ్డి, రాజేష్, సమీపంలోని మరో బ్లాక్‌లో బాలాజీనాయక్‌ నివాసం ఉంటున్నారు.

బాలాజీనాయక్‌ తన కుమారుడు చిత్తేష్‌నాయక్‌కు సోమవారం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఉండడంతో ఆదివారం కారులో కుటుంబంతో సహా అనంతపురం వెళ్లారు. నాగరాజు సమీప బంధువు, ఆర్‌పీఎఫ్‌ పోలీసు ప్రసాద్‌ కుమార్తె రిసెప్షన్‌కు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి బస్సులో అనంతపురం వెళ్లారు. నరసింహారెడ్డి నైట్‌ డ్యూటీకి వెళ్లగా, రాజేష్‌ వ్యక్తిగత పనుల రీత్యా ఆదివారం రాత్రి ఇంట్లో లేరు.

నాలుగు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు ఈ నాలుగు ఇళ్లల్లోకి చొరబడ్డారు. బాలాజీనాయక్‌ ఇంట్లో దాదాపు 75 తులాల బంగారు ఆభరణాలు, 1.50 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు, కుమారుడు చిత్తేష్‌ హుండీ డబ్బు కూడా ఎత్తుకెళ్లారు. నాగరాజు ఇంట్లో 7.5 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.1.60 లక్షల నగదు, నరసింహారెడ్డి ఇంట్లో 3.8 తులాల బంగారం, రూ.10 వేల నగదు అపహరించారు. రాజేష్‌ ఇంట్లో ఏమీ దొరకలేదు.  

బందిపోట్లను తలపిస్తూ.. 
అపహరించిన సొమ్ము, సొత్తు మూటలతో దొంగలు రాత్రి 2.30 గంటల సమయంలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో నాగరాజు కుటుంబసభ్యులు అనంతపురంలో వివాహ రిసెప్షన్‌ ముగించుకుని ఇంటికి వచ్చారు. తాళం పగులగొట్టి ఉండడంతో నాగరాజు వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల చీకటి ప్రదేశాల్లో వెదికిన నాగరాజు కుటుంబసభ్యులు సమీపంలోని ముళ్లపొదల్లో నక్కి ఉన్న ముగ్గురు దొంగలను గమనించారు. అంతలోనే వన్‌టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి పట్టుకోవడానికి ప్రయతి్నంచగా దొంగలు రాళ్లు విసిరారు.

నాగరాజుపైకి కత్తి విసరగా ఆయన తప్పించుకున్నారు. నాగరాజు అన్న వీరేష్ పై కాలిపై రాయి పడడంతో రక్తగాయమైంది. సొమ్ము, సొత్తు మూటలతో పారిపోతున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. దొంగలు రాళ్లు విసురుతూ సమీపంలోని హంపయ్య కొట్టాల మీదుగా ముళ్లపొదల్లో వెళ్లి అక్కడ నుంచి చీకట్లో అదృశ్యమయ్యారు. ముగ్గురు దొంగలు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మనోహర్‌ సోమవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలు హంపయ్య కొట్టాల ఏరియా వైపు వెళ్లి అక్కడ ఆగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement