డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ‘ఐక్యూలీప్’తో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం
ఆ సంస్థలో ఉన్నది ముగ్గురు ఉద్యోగులే..
ఫోటాన్ కోర్ సిస్టమ్స్ జనవరిలో ప్రారంభం.. మూలధన వ్యయం రూ.10 లక్షలే..
స్థాపించిన ఆరు నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డు అందుకున్న ట్రై క్వాంటా?
మరో రెండు కంపెనీల అడ్రస్ కూడా దొరకడం లేదట..!
చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ‘క్వాంటమ్’ ఒప్పందాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
సాక్షి, అమరావతి: ఇటీవల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన సమయంలో 14 కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. కేవలం ఒప్పందాల కోసమే కొన్ని కంపెనీలను సృష్టించి, వాటితో ఎంవోయూలు కుదుర్చుకున్నారంటూ ఆధారాలతో సహా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీల్లో... మూడు కంపెనీలు డిసెంబర్, జనవరి నెలల్లోనే ఏర్పాటయ్యాయని... మరో రెండు కంపెనీల అడ్రస్‌లు ఎంత వెతికినా దొరకడం లేదని విమర్శిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఏర్పాటు చేసిన కంపెనీలతో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం కుదుర్చుకొని 35 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ముగ్గురు ఉద్యోగులున్న కంపెనీతో ఒప్పందమా... 35 లక్షల ఉద్యోగాలా?
చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో ఐక్యూలీప్ అనే కంపెనీ డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులే ఉన్నారు. ఫోటాన్ కోర్ సిస్టమ్స్ అనే కంపెనీ రూ.10 లక్షల మూలధనంతో జనవరి 12న ఏర్పాటైంది. ఇక ట్రై క్వాంటా అనే కంపెనీ కూడా నెలల వ్యవధిలోనే ఏర్పాటైంది. అయితే ఆ కంపెనీ నెలకొ ల్పిన ఆరు నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ, ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అప్పుడే ఆ కంపెనీకి అవార్డులు ఎవరిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ప్రొఫైల్స్ చూసిన నెటిజన్లు.. ఒకటి, రెండు నెలల కిందటే ఏర్పాటు చేయడంతోపాటు కేవలం ముగ్గురు ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంత మందికి శిక్షణ ఇస్తారు? 35 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా క ల్పిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.
బాబు ప్రభుత్వం భారీ ప్రచారం
ఎప్పటిలాగానే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన పేరుతో గ్రాఫిక్ డిజైన్స్ విడుదల చేసి చంద్రబాబు సర్కారు భారీ ప్రచారం చేసుకుంది. రూ.9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలంటూ గ్రాఫిక్స్‌తో సినిమా చూపించింది. వాస్తవంగా చూస్తే ఒప్పందానికి ఒకటి, రెండు నెలల ముందు పుట్టిన మూడు కంపెనీలు, అడ్రస్ దొరకని మరో రెండు కంపెనీలతోపాటు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, బోసాన్ క్యూసై, ఐక్యూలీప్, క్యూబిక్‌ఫోర్స్, క్వాంటమ్ ఫోకస్ ల్యాబ్స్ వంటి లోకల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.


