రామ్మోహన్‌ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించండి | Rohit Pawar Demand Resignation Rammohan Naidu | Sakshi
Sakshi News home page

రామ్మోహన్‌ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించండి

Feb 24 2026 2:25 AM | Updated on Feb 24 2026 9:32 AM

Rohit Pawar Demand Resignation Rammohan Naidu

ఆయనకు, వీఎస్‌ఆర్‌ కంపెనీకి మధ్య సంబంధాలు 

ఆయన పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదు   

దివంగత డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ 

ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు లేఖలు 

న్యాయం జరిగే వరకూ తాము పోరాడతామంటూ స్పష్టికరణ

సాక్షి, న్యూఢిల్లీ: ‘అజిత్‌ దాదా ఫ్లయిట్‌ క్రాష్‌ వెనుక తమకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయండి. మనుషుల మధ్య లేని దాదా మృతికి న్యాయం చేయండి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ కోరారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖలు రాసిన రోహిత్‌ పవార్‌  సోమవారం ఆ లేఖలను తమ సిబ్బంది ద్వారా ఢిల్లీలో పీఎంఓ, హోంశాఖ కార్యాలయాలకు పంపారు. లేఖల్లో ఆయన ప్రస్తావించిన వివరాలివీ.. 

ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది 
‘‘అజిత్‌ పవార్‌ ప్రయాణించిన ఫ్లయిట్‌ క్రాష్‌ అవ్వడం వెనుక భారీ కుట్రకోణం ఉన్నట్లు మాకు అనుమానాలున్నాయి. ఘటన స్థలంలో అనేక పేలుళ్లు జరిగినట్లు గుర్తించాం. ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి మరణిస్తే.. విచారణ అనేది పూర్తి కాకుండా, పూర్తి రిపోర్టు బయటకు రాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు ‘‘వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ కంపెనీ’’ తప్పేమీ లేదని ఎలా ప్రకటిస్తారని ప్రశి్నంచారు. ఆయన ప్రకటన తర్వాత తమకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత తాము లోతుగా పరిశీలిస్తే.. నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు వీఎస్‌ఆర్‌ కంపెనీకి మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను మీకు అందజేస్తున్నాం. ఈ సంబంధాలపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యే వరకూ రామ్మోహన్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలి. రామ్మోహన్‌ నాయుడు ఆ పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తారు. ఈ కారణంగా అజిత్‌ దాదా మృతికి న్యాయం దక్కదు. ఆ ఉద్దేశంతోనే తాము రామ్మోహన్‌ నాయుడు రాజీనామాను డిమాండ్‌ చేస్తున్నాం. డీజీసీఏ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అన్నదీ స్వతంత్రంగా పరిశీలించాలి’ అని ఆ లేఖల్లో రోహిత్‌ పవార్‌ కోరారు. అజిత్‌ పవార్‌ మృతికి న్యాయం జరిగే వరకూ తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement