రెడ్‌బుక్‌ రివర్స్‌.. బిహార్‌లో బేజార్‌! | Patna court refuses transit remand to AP police over arrest of IPS officer | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రివర్స్‌.. బిహార్‌లో బేజార్‌!

Feb 24 2026 2:07 AM | Updated on Feb 24 2026 2:17 AM

Patna court refuses transit remand to AP police over arrest of IPS officer

బిహార్‌ ఐజీ సునీల్‌ నాయక్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ఆయన ఇంటి వద్దకు అక్రమంగా చేరుకున్న ఏపీ పోలీసులు

పట్నాలో తెల్లవారుజామున ఎస్పీ దామోదర్‌ బృందం అరాచకం

గిరిజన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ అక్రమ అరెస్టుకు బరితెగింపు 

గోడ దూకి చొరబడి కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లే యత్నం 

ఏపీ పోలీసులను అడ్డుకున్న బిహార్‌ పోలీసులు.. 

గంటలపాటు వాగ్వాదం... ఉద్రిక్తత 

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. వారెంట్‌.. కేసు డైరీ లేదు  

ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు మండిపాటు 

సునీల్‌నాయక్‌ అరెస్టుకు అనుమతి నిరాకరణ 

తీవ్ర అవమానంతో ఏపీ పోలీసుల తిరుగుముఖం

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ అరాచకాలకు బిహార్‌ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది! రెడ్‌బుక్‌ రాజ్యాంగ వేధింపులను బిహార్‌లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. ప్రస్తుతం బిహార్‌లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్‌ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్‌ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్‌ నాయక్‌ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్‌ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్‌ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.

మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్‌ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్‌ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్‌ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్‌ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్‌ రావడం ఏమిటి..? సునీల్‌ నాయక్‌ అరెస్టు­ను అనుమతించేది లేదు.. ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్‌ కోర్టు మండిపడింది. 

సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేస్తామని కూడా వ్యాఖ్యానించింది. దాంతో బిహార్‌లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్క మొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చి తీవ్ర అవమానభారంతో వెనుదిరిగారు. యావత్‌ దేశంలో సంచలనంగా మారిన ఏపీ పోలీసుల రెడ్‌బుక్‌ అరాచకం ఇలా ఉంది..!! 

కిడ్నాపర్ల మాదిరిగా ఏపీ పోలీసులు..  
డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఇచి్చన ఫిర్యాదుపై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరితెగించి వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్‌ పోలీసు శాఖకు రెడ్‌బుక్‌ టాస్క్ ను అప్పగించారు. దాంతో గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేయించి దర్యాప్తు పేరిట దళిత, గిరిజన ఐపీఎస్‌ అధికారులను వేధిస్తున్నారు. అందుకోసం అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయినా సరే ఈ కేసు దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో సీఐడీ డీఐజీగా పని చేసిన గిరిజన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రస్తుతం బిహార్‌లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్‌ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్‌ తన బృందంతో కలసి సోమవారం తెల్లవారుజామున సునీల్‌ నాయక్‌ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టిముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్‌ నాయక్‌ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు వందమంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు.  

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు... కేసు డైరీ, వారెంటూ లేదు.. 
బిహార్‌ అగ్ని మాపక శాఖ డీజీతోపాటు పలువురు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు అక్కడకు చేరుకుని గట్టిగా నిలదీయడంతో ఏపీ పోలీసుల బండారం బయటపడింది. తాను ఎస్పీనని.. సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేసేందుకు వచ్చామని దామోదర్‌ చెప్పడంతో బిహార్‌ పోలీసు అధికారి, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా ఏపీ పోలీసులు తెల్లమొహం వేశారు. పోనీ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు..? కేసు డైరీ ఉందా..? ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఉందా..? స్థానిక కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్‌ వారెంట్‌ ఉందా..? అని నిలదీయడంతో అవేవీ తమ వద్ద లేవని బదులిచ్చారు. అసలు సునీల్‌నాయక్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని న్యాయవాదులు గుర్తు చేయడంతో ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. అయినా సరే.. 35 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద సునీల్‌నాయక్‌ను తాము అరెస్టు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.

అయితే ఆ నిబంధన కింద అరెస్టు చేసేందుకు వారికి అధికారం లేదని న్యాయవాదులు అభ్యంతరం తెలిపినా ఆలకించలేదు. ఆయన్ను అరెస్టు చేశామని, తమతో తీసుకువెళ్తామని మొండిగా వాదించారు. సునీల్‌నాయక్‌ను  బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో బిహార్‌ పోలీసులు తీవ్రంగా స్పందించారు. వంద మందికిపైగా పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసు బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడకు చేరుకున్న పట్నా ఎస్పీ (ఈస్ట్‌) భానుప్రతాప్‌సింగ్‌ ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్‌ నాయక్‌ను మీరు అరెస్టు చేశామనుకుంటే అనుకోండి..! కానీ ఆయన్ను మా అనుమతి లేకుండా... న్యాయస్థానం ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు.   

ఏపీ పోలీసులపై పట్నా కోర్టు ఫైర్‌.. సునీల్‌ నాయక్‌ అరెస్టుకు ‘నో’ 
ఈ క్రమంలో సునీల్‌ నాయక్‌ తరపు న్యాయవాదులు సోమవారం ఉదయం పట్నా కోర్టును ఆశ్రయించారు. బిహార్‌ ఐపీఎస్‌ అధికారిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఓ ఐపీఎస్‌ అధికారి నివాసంలోకి ఎస్పీ దామోదర్‌ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం గోడదూకి చొరబడటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పట్నా కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేశామని చెబుతూ, ఏపీకి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరారు. దీనిపై బిహార్‌ పోలీసుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్‌ నాయక్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. అనంతరం సునీల్‌ నాయక్‌ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.

సునీల్‌ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్‌ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పట్నా కోర్టు సునీల్‌ నాయక్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్‌ నాయక్‌కు వ్యతిరేకంగా ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేసేందుకు నిరాకరించింది. సునీల్‌ నాయక్‌పై 30 రోజుల వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఎస్పీ దామోదర్‌ బృందం బిహార్‌లో భంగపాటుకు గురైంది.  

ఏపీ డీజీపీ vs బిహార్‌ డీజీపీ
సునీల్‌ నాయక్‌ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసికొట్టడంతో నాలు క కరు­చు­కున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఫోన్‌లో బిహార్‌ డీజీపీ వినయ్‌కుమార్‌తో మాట్లాడించినట్లు సమా­చారం. సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బిహార్‌ డీజీపీ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఐజీ సునీల్‌ నాయక్‌ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి.

ఈ రోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు. ఆయన్ను ఎత్తుకు పోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్‌లో నా బంగ్లాలోకి కూడా అక్రమంగా ప్రవేశించి న­న్నూ ఎత్తుకుపోతారేమో..’ అని తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిహార్‌ పోలీసులకు సమాచారం ఇవ్వ­కుండా.. స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఐపీఎస్‌ అధికారిని అప­హరించేందుకు యత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.

బందిపోటు దొంగల్లా వచ్చారు..! 
బిహార్‌కు చెందిన ఐజీ సునీల్‌ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు. ఏపీకి చెందిన ఎస్పీ స్థాయి అధికారి గోడదూకి సునీల్‌నాయక్‌ నివాసంలోకి చొరబడ్డారు. ఏపీ పోలీసులు ఎటువంటి నిబంధనలను పాటించలేదు. వారి వద్ద అరెస్టు వారెంటూ లేదు.. కేసు డైరీ లేదు.. ఎఫ్‌ఐఆర్‌లో కనీసం సునీల్‌ నాయక్‌ పేరు లేదు. బిహార్‌ వచ్చి ఏదైనా చేయవచ్చని అనుకుంటే ఎలా..? ఏపీ పోలీసుల తీరును పట్నా కోర్టు తప్పుబట్టింది. సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. సునీల్‌ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తాం. 
– శ్రీవాస్తవ్, కునాల్‌ తివారీ, సునీల్‌నాయక్‌ తరపు న్యాయవాదులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement