మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం | Chandrababu Govt Negligence: Adulterated milk scandal in Rajahmundry | Sakshi
Sakshi News home page

మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం

Feb 24 2026 4:47 AM | Updated on Feb 24 2026 4:47 AM

Chandrababu Govt Negligence: Adulterated milk scandal in Rajahmundry

రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం

ఐదుకు చేరిన మృతుల సంఖ్య 

బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమం 

మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం

73 కుటుంబాల నుంచి రక్త నమూనాల సేకరణ 

రూ.లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న బాధితులు 

106 కుటుంబాలకు పాలు పోస్తున్న గణేష్‌ 

అతన్ని అరెస్టు చేసిన కోరుకొండ పోలీసులు

46 పశువులకు పరీక్షలు 

పాలు, పెరుగు నమూనాలు హైదరాబాద్, విశాఖ ల్యాబ్‌లకు తరలింపు 

కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజుల సమయం 

ప్రభుత్వం ఘోర వైఫల్యం బాధితులను పట్టించుకోని అధికార పార్టీ నేతలు 

బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నేతలు జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ  

దేవుడి ప్రసాదంలో కల్తీ అంటూ డెయిరీలను భయపెట్టి సొంత డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న పాల కల్తీపై లేకపోయింది. పాల కల్తీ బయటపడి వారం రోజులవుతున్నా.. వరుసగా ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్ఘాంతపరుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుసుకోవడానికి రాజమహేంద్రవరం పాల కల్తీ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు.  

సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల దుర్ఘటన మరణ మృదంగం మోగిస్తోంది. లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, వెంకటేశ్వర నగర్‌లలో చోటుచేసుకుంటున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్‌.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి రమణి (58) మరణించారు. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా.. అధికారులు మాత్రం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

17 మంది బాధితులు 
ఒక్కసారిగా మూత్రం ఆగిపోవడం (అనూరియా), వాంతులు, విరేచనాలు కావడం, కిడ్నీ ఫెయిల్‌ కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మంది కిమ్స్, రెయిన్‌బో, రవి చైతన్య, సన్‌స్టార్‌ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్‌లో ఏడుగురు చికిత్స పొందుతుండగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెయిన్‌బోలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఐదు నెలల చిన్నారికి డయాలసిస్‌ చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అభం శుభం తెలియని పసివాడికి చికిత్స అందిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదిత్య ఆస్పత్రిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. 

రవి చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరికొందరు జయ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం కల్తీ పాల బాధితులు 19 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మంది మృతి చెందగా.. మరో 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం మొత్తం బాధితులు 17 మందేనని స్పష్టం చేశారు. వీరిలో నలుగురు మృతి చెందారని చెబుతున్నారు. 


కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజులు 
పాలల్లో కల్తీని నిర్ధారించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాల వ్యాపారి గణేష్‌ నుంచి పాలు పోయించుకుంటున్న 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఈ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను వైజ్ఞానిక, పశు సంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపించారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు కలెక్టర్‌ కీర్తి చేకూరి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు సైతం పంపించామన్నారు. 

వెలుగులోకి కీలక విషయాలు 
కల్తీ పాల కలవరానికి కారణమని భావిస్తున్న పాల వ్యాపారి గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు తెలిసింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్, వెంకటేశ్వర నగర్‌లలోని 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్‌ అనే వ్యాపారి ప్రతిరోజూ పాలు పోస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి కావడంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దీంతో రోజూ పాలుపోసే వారితో కలిపి మొత్తం 126 కుటుంబాలకు గణేష్‌ ఆ రోజు పాలు పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. 16వ తేదీన పోసిన పాలు కొంచెం చేదుగా ఉన్నాయని వినియోగదారులు గణేష్‌ దృష్టికి తీసుకెళ్లగా.. మరునాటి నుంచి అలా జరగదని అతడు చెప్పడంతో మిన్నకుండిపోయారు. తిరిగి సాధారణంగా ఎప్పుడూ ఉండే రుచే ఉండటంతో వినియోగదారులు పట్టించుకోలేదు. ఆ రోజు గణేష్‌ నరసాపురం గ్రామ పరిసరాల్లో పాలను సేకరించినట్లు సమాచారం. దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాలు ఎక్కడెక్కడ, ఎవరెవరి నుంచి సేకరించాడనే విషయమై ఆరా తీస్తున్నారు. 


అనధికార డెయిరీ సీజ్‌ 
పాల వ్యాపారి గణేష్‌ నరసాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని పోలీసులు సీజ్‌ చేశారు. పాలు సేకరించే పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. వెనిగర్, పాలు, కెమికల్స్‌ స్వాదీనం చేసుకున్నారు. పాలు, నీళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పశువుల రక్త నమూనాలు సైతం సేకరించారు. కారణాలు బయటకొచ్చిన వెంటనే గణేష్‌తో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

కాలనీల్లో వైద్య బృందాలు 
చౌడేశ్వరి నగర్, స్వరూప్‌ నగర్‌లలో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. పాలు వినియోగించిన వారి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అధికారులు 18 బృందాలుగా విడి­పోయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ 
కల్తీ పాల బాధితులను, బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్‌లో పర్యటించి ఏం జరిగిందనే విషయంపై బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెయిన్‌బో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ పాల ఘటనపై వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆరా తీశారు.

మా ఇంట్లో ముగ్గురి పరిస్థితి విషమం 
మా ఇంట్లో నా తల్లి, తండ్రితో పాటు నా కుటుంబ సభ్యులు నలుగురికి కిడ్నీ విఫలమైంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శివరాత్రి నాడు మా పాల వ్యాపారి అందించిన పాలు తీసుకున్న తర్వాత ఈ అనర్థం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత అంటే.. ఈ నెల 22న అందరికీ మూత్రం ఆగిపోయింది. కుటుంబంలో అందరికీ ఒకే సమస్య రావడంతో ఆందోళనకు గురై కిమ్స్‌ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. 
– మధు, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరం

శరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి 
మా మనవరాలు నాలుగు రోజుల క్రితం పాలు తాగిన వెంటనే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆ పాల వ్యాపారికి మేం ఈ విషయం చెప్పాం. పాలు చేదుగా ఉన్నాయని తెలిపాం. కొత్తగా గేదె ఈనిందని, అందుకే పాల రుచిలో తేడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అతను పాలు పోసిన ఇళ్లలో కిడ్నీ బాధితులు బయటపడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నాం. మా మనవరాలిని ఆస్పత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. 
– షేక్‌ సిరాజుద్దీన్, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరం

మిగతా వారిలోనూ సమస్యలు రావొచ్చు 
ఈ నెల 14న రాత్రి మూత్ర సమస్యతో నా వద్దకు కొందరు వచ్చారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచినీటి సరఫరాపై అనుమానం కలి­గింది. మంచినీటి సరఫరా బాగానే ఉందని మున్సిపల్‌ అధికారులు స్పష్టంచేయడంతో రోగులు తీసుకున్న ఆహారంపై ఆరా తీయగా పాలు తాగిన తర్వాత ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. ముందుగా బలహీనంగా ఉండే వృద్ధులు, చిన్నారులపై కల్తీ పాలు ప్రభావం చూపించాయి. మిగతా వారిలో కూడా భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అందుకే ఆ పాలు తాగిన వారందరూ కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్‌ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్‌ శశాంక్, కిడ్నీ వ్యాధుల నిపుణుడు, రాజమహేంద్రవరం

అందని ప్రభుత్వ వైద్యం
బాధితులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూత్ర విసర్జన స్తంభించడం, కిడ్నీ సమస్యలు, వాంతులు, విరేచనాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు మూడేళ్ల చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడకు తీసుకెళ్లగా తమ­వద్ద వైద్య సదుపాయాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు లబోదిబోమంటూ తిరిగి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే విధంగా మరో చిన్నారి రితిక్‌ చికిత్స కోసం ఇప్పటివరకు ప్రైవేట్‌ ఆస్పత్రి­లో రూ.8.50 లక్షలకు పైగా  ఖర్చయింది. మిగిలిన బాధితులకు సైతం వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement