‘ఇందాపూర్’పై చర్చించాల్సిందే | YSRCP Leader Botsa Satyanarayana Slams AP Govt Over Laddu Discussion And Heritage Indapur Links Issue, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘ఇందాపూర్’పై చర్చించాల్సిందే

Feb 24 2026 4:29 AM | Updated on Feb 24 2026 11:13 AM

YSRCP Leader Botsa Satyanarayana Slams AP Govt Over Laddu Discussion

మీడియా పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

టీటీడీకి ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరాపై మండలిలో చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు

వైఎస్సార్‌సీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్‌ 

పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన 

ప్రతిగా టీడీపీ, జనసేన సభ్యులు కూడా పోడియం వద్ద నినాదాలు  

మండలి ప్రారంభమైన ఏడు నిమిషాలకే వాయిదా  

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి హెరిటేజ్‌ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో మండలి ప్రారంభం కాగానే టీటీడీకి ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, వై.శివరామిరెడ్డి, పీవీవీ సూర్యనారాయణరాజు వాయిదా తీర్మానం ఇచ్చారు.

దానిని తిరస్కరించిన చైర్మన్‌ మోషేన్‌రాజు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్దే నిలుచుని ఇందాపూర్‌పై చర్చ జరగాలి.. హెరిటేజ్‌పై చర్చ జరగాలి... తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి... అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ చైర్మన్‌ పోడియం వద్దకు చేరుకుని చర్చకు పట్టుపట్టారు. అదే సమయంలో పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్‌ పోడియం ముందుకు వెళ్లి పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో... ప్రారంభమైన ఏడు నిమిషాలకే చైర్మన్‌ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సభ ముగిశాక మీడియా పాయింట్‌ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోల్ని చెప్పులతో పట్టుకున్నామని సీసీ ఫుటేజ్‌ సగం తీసుకొచ్చి నానా హడావుడి చేశారు. బీఏసీ మీటింగ్‌లో ఫూర్తి ఫుటేజ్‌ కావాలని కోరాం. అందులో చూస్తే వైఎస్సార్‌సీపీ సభ్యులు దేవుని ఫొటో పట్టుకున్నప్పుడు చెప్పులు ధరించలేదని స్పష్టంగా ఉంది. చెప్పులు ధరించినట్లుగా ప్రచారం చేస్తున్న దృశ్యాలు లేవు. కాబట్టి ఈ వీడియోల్ని ఎలా మారి్ఫంగ్‌ చేశారన్నది చర్చించాలని మండలి చైర్మన్‌ను కోరాం.

అలాగే, మండలిలో మేం మాట్లాడేది బయటకి రావడంలేదు. టీడీపీ సభ్యులు మాట్లాడితేనే లైవ్‌ ఇస్తున్నారు. అసలు మండలిలోని మా ఫొటోలు బయటికెవరు విడుదల చేశారు?’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ కోసం మేము చేస్తున్న డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. బీఏసీ సమావేశం సోమవారం జరిగింది.. ఇందులో ఈనెల 26న మండలిలో చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడితే ఇప్పటివరకూ తప్పించుకున్నారు.

సీబీఐపై నమ్మకంలేకే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను వేసింది.. అయితే, న్యాయస్థానాలపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. బీఏసీ భేటీలో మూడు అంశాలపై చర్చ చేపట్టాలని కోరాం. ఇందులో మొదటిది.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, రెండోది.. రైతుల ఇబ్బందులు, మూడోది.. లడ్డూ నెయ్యి. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేశారు.. గిట్టుబాటు ధరలేదు.. బీమా లేదు.. పొగాకు, మిర్చి, మొక్కజొన్న, కోకో, మామిడి రైతులు ఇబ్బందిపడుతున్నారు’ అని బొత్స తెలిపారు.  

విశాఖలో భూదోపిడీపైనా చర్చిస్తాం.. 
‘మండలిలో విద్య, సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చిద్దామన్నారు. అందుకు అంగీకరించాం. వైజాగ్‌లో గీతం వర్సిటీ పేరు మీద రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న మొన్న పెట్టిన స్టార్టప్‌ కంపెనీలకు 99 పైసలకే కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపైనా చర్చ కోరాం. విశాఖలో భూములను చంద్రబాబు కుటుంబం ఎలా దోచుకుంటుందో మండలిలో చర్చిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హెరిటేజ్‌ వెనుక ఉన్న ఇందాపూర్‌ డెయిరీ హైదరాబాద్‌ మార్కెట్‌లో కేజీ నెయ్యి రూ.560 (జీఎస్టీ అదనం)కి అమ్ముతూ.. టీటీడీకి మాత్రం రూ.658కు సరఫరా చేస్తోంది.

దీన్నిబట్టి ప్రజలకు కల్తీనెయ్యి అమ్ముతున్నారని అనుకోవాలా? లేక టీటీడీకి ఎక్కువ ధరకు సరఫరా చేస్తూ శ్రీవారి సొమ్మును దోచుకుంటున్నట్లు అనుకోవాలా? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. టీడీపీ కూటమి నేతలకు, వారి సంస్థలకు ధనార్జన ఆశ లేకపోతే దేవుడికి సరఫరా చేసే నెయ్యి రేటు తగ్గించి ఇవ్వాలి కదా?’ అని ప్రశి్నంచారు. 

కల్తీ పాలు మరణాలు సర్కారు హత్యలే.. 
రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడం, 20 మంది వరకూ ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అర్ధంచేసుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం, దిగువ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడంవల్ల ఈ మరణాలు జరిగాయి. గతంలో కల్తీసారా మరణాలు చూశాం.. కానీ, కల్తీ పాలతో జనం చనిపోవడం ఇప్పుడే వింటున్నాం. అన్ని శాఖల్నీ గాలికొదిలేశారు. పచ్చ మీడియా వాస్తవాలు పక్కనబెట్టి ప్రభుత్వాన్ని మోస్తోంది. రాజమహేంద్రవరంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. కల్తీ చేసిన వారితో పాటు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే భయం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

బాబు దుర్మార్గాలు బయటకొస్తున్నాయి.. 
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ విమాన ప్రమాద ఘటనపై మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచి్చంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హెరిటేజ్‌కి వీఎస్‌ఆర్‌ ఏవియేషన్‌కు ఉన్న బంధం ఏంటో రోహిత్‌ పవారే బయటపెట్టారు. దీనికి అధికార పక్షం ఏం సమాధానం చెబుతుంది? హెరిటేజ్‌ సంస్థ పాలు, పెరుగు వ్యాపారం మాత్రమే చేస్తుందని అందరం అనుకున్నాం. కానీ, హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ అనే మరో సంస్థ ద్వారా వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు దుర్మార్గాలు ప్రజలకు ఒకొక్కటిగా తెలిసిపోతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement