ప్రమాదకరస్థాయిలో ఇథిలిన్ గ్లైకాల్
యూరియా కూడా మోతాదుకు మించి..
ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడి ప్రాథమిక నిర్ధారణ!
చిక్కదనం కోసం కలిపినట్టు గుర్తింపు
అందుకే కిడ్నీలు షట్‌డౌన్.. రోజుకు రెండుసార్లు డయాలసిస్
సాక్షి, అమరావతి: అధిక మోతాదులో యూరియా, ఇథిలీన్ గ్లైకాల్ వంటి రసాయనాలు కలిసిన కల్తీ పాలే ప్రజల ప్రాణాల మీదకు తెచ్చినట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో మృతులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి గమనించిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధన ఐసీఎంఆర్ బృంద సభ్యుడు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఇథిలీన్ గ్లైకాల్ ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
పాలు చిక్కగా ఉన్నాయని భ్రమింపజేయడానికి యూరియాను, కల్తీ చేసిన పాలు త్వరగా పాడవ్వకుండా ఉండటానికి, ఒకరకమైన తీపిదనాన్ని ఇవ్వడానికి ఇథిలీన్ గ్లైకాల్ కలుపుతుంటారు. ఈ రెండూ మోతాదుకు మించి కలపడం వల్లే ప్రస్తుతం రాజమహేంద్రవరం బాధితుల కిడ్నీలు షట్‌డౌన్‌కు దారితీసిందని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రోజుకు రెండు సార్లు డయాలసిస్
రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి పండగ ముగిసిన మరుసటి రోజు నుంచి కల్తీ పాల వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. క్రమంగా సమస్యలు తీవ్ర రూపం దాల్చి కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మూత్రం ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని ‘అనూరియా’(హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి) సంభవించింది. రక్తంలో యూరియా, క్రియాటిన్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని బాధితులకు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. సాధారణంగా రక్తంలో యూరియా వయోజనుల్లో 8–24 మిల్లీగ్రాములు, వృద్ధుల్లో 8–26 మిల్లీగ్రాములు, సీరమ్ క్రియాటిన్ 0.7–1.3 మిల్లీగ్రాములు ఉండాలి. అయితే రాజమండ్రి బాధితుల రక్తంలో యూరియా 130–140 మిల్లీగ్రాములు, క్రియాటిన్ 9 మిల్లీగ్రాములు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్ ఘటనల్లో బాధితులకు రోజుకు ఒకసారి డయాలసిస్ చేస్తే సరిపోతుందని, అయితే రాజమండ్రిలో కొందరు బాధితులకు రోజులో రెండోసారి కూడా డయాలసిస్ చేసినట్టు స్పష్టం చేశారు.
సర్కారు పర్యవేక్షణ శూన్యం
రాజమండ్రి ఘటనతో రాష్ట్రంలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగుతోందని స్పష్టమవుతోంది. ఇంత భారీ స్థాయిలో కేటుగాళ్లు రెచి్చపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకు 500–50 వేల లీటర్ల పాలను సేకరించే/ప్రాసెస్ చేసే, ఏడాదికి రూ.20 కోట్లలోపు టర్నోవర్ ఉండే డెయిరీలు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాజమండ్రి ఘటనలో పాల సరఫరా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే డెయిరీల్లో పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏ మాత్రం లేదని తేటతెల్లమవుతోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేసిందని స్పష్టమవుతోంది.


