ఏఐ గుప్పిట్లోకి కోచింగ్‌ మాడ్యూల్‌ | Artificial intelligence dominates national exams | Sakshi
Sakshi News home page

ఏఐ గుప్పిట్లోకి కోచింగ్‌ మాడ్యూల్‌

Feb 24 2026 2:59 AM | Updated on Feb 24 2026 2:59 AM

Artificial intelligence dominates national exams

జాతీయ పరీక్షల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధిపత్యం 

నీట్, జేఈఈ పరీక్షల కోసం సరికొత్త లెర్నింగ్‌ మాడ్యూల్స్‌ 

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కోచింగ్‌ కోసం సరికొత్త టెక్నాలజీ 

2028 నాటికి రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు 

నాణ్యత తప్పితే ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన 

సరైన నిఘా ఉండాల్సిందే అంటున్న ఉన్నత విద్యామండలి

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్, మెడికల్‌ వంటి కీలకమైన కోచింగ్‌నూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావితం చేయబోతోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెన్సీ ఇన్ఫీనియం సంస్థ ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికను వెల్లడించింది. మారుతున్న ట్రెండ్‌కు అనుకూలంగా కోచింగ్‌ విధానాలను ఏఐతో ఆధునీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థల తోడ్పాటును ఆన్‌లైన్‌ కోచింగ్‌ కేంద్రాలు ఇప్పటికే తీసుకున్నాయి. నీట్, జేఈఈ రాసే విద్యార్థుల్లో 80 శాతం మంది కోచింగ్‌పైనే ఆధార పడుతున్నారు. 2022 వరకూ కోచింగ్‌ కేంద్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రూ.70 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఏఐ ఆధారిత మాడ్యూల్స్‌ను జోడించడం వల్ల ఇది 2028 నాటికి 2.5 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే  కోచింగ్‌ కేంద్రాలు మార్కెట్లో పబ్లిసిటీకి ఏటా రూ.150 కోట్లకుపైగానే ఖర్చు పెడుతున్నాయి. 

ఈ లాంగ్వేజ్‌ కీలకం 
పైథాన్‌ లాంగ్వేజ్‌ ఆధారంగా ప్రోగ్రామింగ్‌ చేస్తున్నారు. నీట్, జేఈఈ వంటి వాటిల్లో అనలైటిక్స్, స్టూడెంట్‌ ప్రొఫైలింగ్, అనుమానాల నివృత్తి చేసే బాట్స్‌ మొత్తం ఏఐతోనే పనిచేస్తాయి. ఇవి ప్రశ్నల్లో ఉన్న కఠినత్వం, వాటి పరిష్కారం, మాక్‌ టెస్టుల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత స్టడీ ప్లాన్‌ రూపొందిస్తాయి. లైవ్‌ డాష్‌బోర్డ్, ఏఐ చాట్‌బాట్‌లను రూపొందిస్తున్నారు. ర్యాంక్‌ ప్రిడిక్షన్‌ ద్వారా సీటు ఎక్కడ వస్తుందనే కౌన్సెలింగ్‌ ప్లానింగ్‌ కూడా ఉంటుంది. న్యూరల్‌ నెట్‌వర్క్, అటెన్షన్‌ మాడ్యూల్స్‌ ప్రిపరేషన్‌ స్థాయిని పెంచేలా ప్రొగ్రామ్‌ చేస్తున్నారు. కెమికల్‌ ఎడ్యుకేషన్‌ పార్శింగ్, ఆర్గానిక్‌ రియాక్షన్‌ స్వీకెన్స్‌ అనాలసిస్‌ ఏఐ అందిస్తుంది. సింబాలిక్‌ రీజనింగ్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్‌ లాజిక్, వెక్టార్‌ అండ్‌ మ్యాట్రిక్స్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి మ్యాథ్స్‌ ఆధారిత ప్రోగ్రామింగ్‌లోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది.  

ఒత్తిడి పెరుగుతుందా? తగ్గుతుందా? 
కోచింగ్‌ కేంద్రాలు ఏఐ మాడ్యూల్స్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, దీనిపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలి. దేశంలోని 78 శాతం కోచింగ్‌ కేంద్రాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా జేఈఈ, నీట్‌లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేపోతున్నారు. ఈ దశలో ఏఐ మాడ్యూల్స్‌ కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు మానసిక ఒత్తిడి వస్తుందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్‌కు ఏటా 13 లక్షల మంది, నీట్‌కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. 

కోచింగ్‌ కేంద్రాలు ర్యాంకులు సాధించే మెరిట్‌ విద్యార్థులను విడగొట్టి క్లాసులు నిర్వహిస్తాయి. వీళ్లు 20 శాతమే ఉంటున్నారు. మిగతా వాళ్లను నాణ్యత లేని ఫ్యాకల్టీతో కాలం వెళ్లదీస్తున్నాయి. ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహ్యలు చేసుకుంటే, 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 నాటికి ఇది 13 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఈ పరిస్థితికి వెళ్లకుండా ఆన్‌లైన్‌ కేంద్రాలపై నియంత్రణ అవసరమని ఐఐటీ–బాంబే అధ్యాపకుడు నీలం త్రివిక్రమ్‌ సూచించారు.  

కేంద్ర కమిటీ అధ్యయనం 
జేఈఈ, నీట్‌ కోచింగ్‌ కేంద్రాల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ గత ఏడాది కమిటీ వేసింది. కేంద్ర ఉన్నత విద్య కార్యదర్శి వినీత్‌ జోషి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్‌ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపల్‌ను ఇందులో సభ్యులుగా చేర్చింది. కోచింగ్‌తో పనిలేకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాల పబ్లిసిటీ, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించాలి. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్‌ థింకింగ్‌ విధానాలు, స్కూల్‌ విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్‌ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్‌ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పుడు ఏఐ పాత్ర పెరుగుతుండటంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తోంది.  

నిఘా అవసరం... రాష్ట్రానికి మండలి నివేదిక 
ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాలపై సరైన నియంత్రణ ఉండాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయం. ఈ మేరకు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి గతంలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. అకడమిక్‌ పాఠాల వల్ల ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారని, ఆన్‌లైన్‌ వేదికలు, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ పాదర్శకంగా అన్పించడం లేదన్నారు. దీనివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని, కోచింగ్‌ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదని, ఫీజుల భారం పేదవాళ్లను కుంగదీస్తోందని తెలిపారు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్‌ వాడకం వల్ల విద్యా ఫలితాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు. . తప్పుడు అంచనాలు, ఆర్థిక నష్టాలు, విద్యా అంతరాయాలు పెంచుతున్నాయని తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement