కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలకు స్థలాలు | Congress Party Offices In Districts Granted Plots For Construction Of Their Own Buildings, Check Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలకు స్థలాలు

Feb 24 2026 1:43 AM | Updated on Feb 24 2026 12:05 PM

Congress party offices in districts granted plots for construction of their own buildings

గత ప్రభుత్వ జీవోకు అనుగుణంగా కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ కా­ర్యా­లయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం స్థలా­లు మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించిన ఎజెండాను మంత్రివర్గం ఆమోదించింది. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు కోసం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అప్పట్లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీలు చేసిన దరఖాస్తుల మేరకు స్థలాలు కేటాయించడానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

వరి బదులు రైతుల్ని ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా..
వరి ధాన్యం సేకరణ అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర చ­ర్చ జరిగినట్లు సమాచారం. రికార్డు స్థాయిలో ఇప్ప­టికే రాష్ట్రంలో వరి దిగుబడి వస్తుండటం, ధాన్యం సేకరణ కూడా అదేస్థాయిలో జరుగుతున్న నేప­థ్యంలో నిల్వలు పేరుకుపోయాయని, భవిష్య­త్తు­లో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం.

ప్రస్తావనకు రాని పరిషత్‌ ఎన్నికలు, రైతుభరోసా!
ఈ మంత్రివర్గ సమావేశంలోనే పరిషత్‌ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ అది జరగకపోవడంతో ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్టేనని, ఆ ఎన్నికలు కొంతకాలం వాయిదా పడ్డాయని తెలుస్తోంది. ఈ అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రాగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో ఉన్నందున పార్లమెంటు సమావేశాల్లో మరోమారు ఈ అంశాన్ని లేవనెత్తాలని కేబినెట్‌ అభిప్రాయ­పడినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాకపోవడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement