breaking news
national exam
-
ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్, మెడికల్ వంటి కీలకమైన కోచింగ్‌నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయబోతోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బిజినెస్ కన్సల్టెన్సీ ఇన్ఫీనియం సంస్థ ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల మార్కెట్ రీసెర్చ్ నివేదికను వెల్లడించింది. మారుతున్న ట్రెండ్‌కు అనుకూలంగా కోచింగ్ విధానాలను ఏఐతో ఆధునీకరించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థల తోడ్పాటును ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు ఇప్పటికే తీసుకున్నాయి. నీట్, జేఈఈ రాసే విద్యార్థుల్లో 80 శాతం మంది కోచింగ్‌పైనే ఆధార పడుతున్నారు. 2022 వరకూ కోచింగ్ కేంద్రాల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రూ.70 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఏఐ ఆధారిత మాడ్యూల్స్‌ను జోడించడం వల్ల ఇది 2028 నాటికి 2.5 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ కేంద్రాలు మార్కెట్లో పబ్లిసిటీకి ఏటా రూ.150 కోట్లకుపైగానే ఖర్చు పెడుతున్నాయి. ఈ లాంగ్వేజ్ కీలకం పైథాన్ లాంగ్వేజ్ ఆధారంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. నీట్, జేఈఈ వంటి వాటిల్లో అనలైటిక్స్, స్టూడెంట్ ప్రొఫైలింగ్, అనుమానాల నివృత్తి చేసే బాట్స్ మొత్తం ఏఐతోనే పనిచేస్తాయి. ఇవి ప్రశ్నల్లో ఉన్న కఠినత్వం, వాటి పరిష్కారం, మాక్ టెస్టుల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత స్టడీ ప్లాన్ రూపొందిస్తాయి. లైవ్ డాష్‌బోర్డ్, ఏఐ చాట్బాట్లను రూపొందిస్తున్నారు. ర్యాంక్ ప్రిడిక్షన్ ద్వారా సీటు ఎక్కడ వస్తుందనే కౌన్సెలింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్, అటెన్షన్ మాడ్యూల్స్ ప్రిపరేషన్ స్థాయిని పెంచేలా ప్రొగ్రామ్ చేస్తున్నారు. కెమికల్ ఎడ్యుకేషన్ పార్శింగ్, ఆర్గానిక్ రియాక్షన్ స్వీకెన్స్ అనాలసిస్ ఏఐ అందిస్తుంది. సింబాలిక్ రీజనింగ్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ లాజిక్, వెక్టార్ అండ్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ప్రిటేషన్ వంటి మ్యాథ్స్ ఆధారిత ప్రోగ్రామింగ్‌లోనూ ఏఐ కీలక పాత్ర పోషించబోతోంది. ఒత్తిడి పెరుగుతుందా? తగ్గుతుందా? కోచింగ్ కేంద్రాలు ఏఐ మాడ్యూల్స్‌ను అనుసరిస్తున్నాయి. అయితే, దీనిపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలి. దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేపోతున్నారు. ఈ దశలో ఏఐ మాడ్యూల్స్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు మానసిక ఒత్తిడి వస్తుందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్‌కు ఏటా 13 లక్షల మంది, నీట్‌కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. కోచింగ్ కేంద్రాలు ర్యాంకులు సాధించే మెరిట్ విద్యార్థులను విడగొట్టి క్లాసులు నిర్వహిస్తాయి. వీళ్లు 20 శాతమే ఉంటున్నారు. మిగతా వాళ్లను నాణ్యత లేని ఫ్యాకల్టీతో కాలం వెళ్లదీస్తున్నాయి. ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహ్యలు చేసుకుంటే, 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 నాటికి ఇది 13 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఈ పరిస్థితికి వెళ్లకుండా ఆన్లైన్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని ఐఐటీ–బాంబే అధ్యాపకుడు నీలం త్రివిక్రమ్ సూచించారు. కేంద్ర కమిటీ అధ్యయనం జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ గత ఏడాది కమిటీ వేసింది. కేంద్ర ఉన్నత విద్య కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్‌ను ఇందులో సభ్యులుగా చేర్చింది. కోచింగ్‌తో పనిలేకుండా పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల పబ్లిసిటీ, నాణ్యత ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించాలి. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, స్కూల్ విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పుడు ఏఐ పాత్ర పెరుగుతుండటంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. నిఘా అవసరం... రాష్ట్రానికి మండలి నివేదిక ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై సరైన నియంత్రణ ఉండాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయం. ఈ మేరకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గతంలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. అకడమిక్ పాఠాల వల్ల ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారని, ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పాదర్శకంగా అన్పించడం లేదన్నారు. దీనివల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని, కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదని, ఫీజుల భారం పేదవాళ్లను కుంగదీస్తోందని తెలిపారు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వాడకం వల్ల విద్యా ఫలితాలు దెబ్బతింటున్నాయని గుర్తించారు. . తప్పుడు అంచనాలు, ఆర్థిక నష్టాలు, విద్యా అంతరాయాలు పెంచుతున్నాయని తెలిపారు. -
బీఎడ్‌కు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష!
ఎంట్రన్స్‌తోపాటు ఎగ్జిట్ పరీక్ష కూడా.. - ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాల పెంపుపై కేంద్రం దృష్టి - రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలకు మంగళం - నిబంధనలు రూపొందించాలని ఎన్‌సీటీఈకి ఆదేశాలు! సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు అందే శిక్షణలోనే సరైన ప్రమాణాలు లేని కారణంగా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదని కేంద్రం గుర్తిం చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కోర్సు పూర్తయ్యాక జాతీయ స్థాయిలోనే 'ఎగ్జిట్' పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా.. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవేశాల విధానం, ప్రవేశ పరీక్షల తీరు, కోర్సుల నిర్వహణ ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయ విద్యా కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అందువల్లే 150కి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో 2016–17 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అటు బీఎడ్ ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్‌కూ అనుమతివ్వలేదు. కొన్ని రాష్ట్రాల్లో బీఎడ్ తరగతుల నిర్వహణ కూడా లేకుండానే కాలేజీలు, సర్టిఫికెట్ల జారీ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఉపాధ్యాయ విద్యను దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2014లో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులు, కాల వ్యవధి, టీచింగ్ ప్రాక్టీస్ వంటి అంశాల్లో ఏక రూప విధానాన్ని తీసుకువచ్చింది. తాజాగా జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని యోచిస్తోంది. ఎగ్జిట్ పరీక్ష కూడా..! బీఎడ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి కాలేజీల్లో నిర్వహించే వార్షిక పరీక్షలే కాకుండా జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పరీక్ష కూడా నిర్వహించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో అర్హత సాధించిన వారే బీఎడ్ కోర్సును పూర్తి చేసినట్లుగా, ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. దీనిద్వారా కేవలం సర్టిఫికెట్ కోసం బీఎడ్ కోర్సు చదవకుండా ఉండేలా.. ఉపాధ్యాయ వృత్తి పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగిన వారే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టినట్లవుతుందని భావిస్తోంది. దీనివల్ల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తోంది. దీనికితోడు బీఎడ్ పూర్తి చేసిన వారికి కనీసం ఆరు నెలల పాటు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ‘ఇండక్షన్ ట్రైనింగ్ (ప్రేరణ కలిగించే శిక్షణ)’ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని (ఎన్సీటీఈ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్సీటీఈ వాటిని ఈ ఏడాదిలోనే సిద్ధం చేస్తే.. 2018–19 విద్యా సంవత్సరం నుంచే బీఎడ్ ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.


