మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్
ఆరోగ్య భద్రత, జీవిత బీమా కల్పిస్తూ రెండు కొత్త పథకాలు
7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా
సహజ మరణం పొందినా రూ.10 లక్షల పరిహారం
17.07 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవల పథకం
652 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,998 రకాల వైద్య సేవలు
మార్చి 31లోగా మెట్రో రైలు తొలి దశ టేకోవర్ పూర్తి
మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 20న బడ్జెట్
జనగణనలో భాగంగా మే 11 నుంచి ఇళ్ల గణన
తెలంగాణ వైద్య విధాన పరిషత్.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్పు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. వారికి ఆరోగ్య భద్రత, జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రకటించింది. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా 7.57 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా వర్తించనుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.1.25 కోట్లు, 60 ఏళ్ల వరకు సహజ మరణం పొందితే రూ.10 లక్షల ప్రయోజనం కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులతోపాటు 2.38 లక్షల మంది పెన్షనర్లు రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండా లబ్ధిపొందనున్నారు.
బ్యాంకర్ల ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గు గనుల సంస్థతో పాటు విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇకపై ఉద్యోగులందరికీ వర్తింపజేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సమాచార, ప్రజాసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్
ఉద్యోగ సంఘాల చిరకాల డిమాండ్ మేరకు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయం కల్పించడానికి క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్(ఈహెచ్‌ఎస్) అమలు చేయాలని కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3.56 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం లభించనుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 652 ఎంప్యానెల్ అయిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూపాయి కూడా చెల్లించకుండా 1,998 రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నారు.
ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం వాటాను, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటాను ట్రస్ట్‌కు చెల్లించనుంది. ఏడాదికి ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి చెరో రూ.528 కోట్ల చొప్పున మొత్తం రూ.1056 కోట్లు సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్ట్‌లో జమ కానున్నాయి. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవల కోసం ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పొంగులేటి తెలిపారు. పథకం అమలు కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డు అందజేయనున్నారు.
వైద్య శాఖలో సంస్కరణలు
గ్రామీణ, పట్టణ ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలతోపాటు వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీఎస్‌హెచ్)గా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు స్వయంప్రతిపత్తి గల వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుంది. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయి.
రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు మరో ఇద్దరు అధికారులను కమిటీలో నియమించి వారి సూచనలు తీసుకుంటారు. ఆసుపత్రుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు వైద్య సేవలు, పరిపాలన బాధ్యతలను వేర్వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా ఆధునీకరణ
హెచ్‌ఎండీఏ విస్తరణలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్‌ఎండీఏలో విలీనం చేసే ప్రక్రియకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.3,145 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్‌ఎంపీ–2) చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. తొలి దశ కింద ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కి.మీ. రోడ్లను రెండో దశ కింద అభివృద్ధి, నిర్వహణ చేపడతారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.722 కోట్లతో మంజీరా తాగునీటి సరఫరా పథకం తొలి దశ, రెండో దశ పథకాలను.. రూ. 282 కోట్లతో ఉస్మాన్‌సాగర్ తాగునీటి సరఫరా పథకాన్ని ఆధునీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. కాలం చెల్లిన పైప్‌లైన్లు, పంప్‌హౌజ్‌లు, మోటార్లు, ట్రీట్‌మెంట్ ప్లాంట్లతో 30 శాతం నీళ్లు వృథా అవుతున్నాయి. ఆధునీకరణలో భాగంగా వీటిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. నీటి సరఫరా మెరుగు పడుతుంది.
మార్చి 31లోగా మెట్రో స్వాధీనం పూర్తి
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నుంచి మార్చి 31లోగా స్వా«దీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 69 కి.మీ. తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి తక్షణమే అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం, సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది. మెట్రో రెండో దశ విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రెండో దశ విస్తరణను మొత్తం ఒకే సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మెట్రో తొలి దశ నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ .. ఆర్థికంగా లాభాదాయకం కాదని రెండో దశ విస్తరణ చేపట్టేందుకు విముఖత తెలిపింది. పెరుగుతున్న ట్రాఫిక్, మెట్రో విస్తరించాల్సిన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకోవటం అనివార్యమైందని ప్రభుత్వం తెలిపింది. రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ‘ఎల్ అండ్ టీ’కి చెల్లించాల్సి ఉంటుందని ఉపసంఘం తెలిపింది. మెట్రో ఆస్తుల విలువ రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
22 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వం మెట్రో తొలి దశను సొంతం చేసుకుంటుంది. ఫేజ్–2ఏలో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కి.మీ., ఫేజ్–2బీలో భాగంగా 3 కారిడార్లలో 86.1 కి.మీ. మెట్రో విస్తరణ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపింది. ఈ నిర్ణయంతో మెట్రో విస్తరణ వేగవంతమవనుంది. టేకోవర్ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్రం తమ ప్రతినిధిగా యూపీ మెట్రో ఆథారిటీ ఎండీ సునీల్ కుమార్‌ను సభ్యుడిగా నియమించింది.
మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 20న బడ్జెట్ ప్రతిపాదనలు సభలో ప్రవేశపెడతారు. 30వరకు సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మే 11న జనగణనకు శ్రీకారం
జన గణన– 2027 నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇళ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్)ను రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 33 ప్రశ్నల నమూనాను సమావేశంలో సీఎస్ వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతోపాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపడతారు.
కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్
రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన 223.09 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించాలని నిర్ణయించింది. ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని కోహెడలో టీజీ హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో ఉన్న 239 ఎకరాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
⇒ మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జేఎనీ్టయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో 36 ఎకరాలను కేటాయించింది.
⇒ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని 21 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి 20–25 ఎకరాల భూములు కేటాయించింది. రూ.200 కోట్లతో ఒక్కో స్కూల్ నిర్మించనున్నారు.
⇒ హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాల రక్షణ శాఖ భూములను తీసుకున్నందున సమాన విలువైన 153 ఎకరాల భూములను రక్షణ శాఖకు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
⇒ భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేబినెట్ కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయించింది. టీటీడీ సొంత నిధులతో దేవాలయం, స్టేడియం, ఫంక్షన్ హాల్ నిర్మించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయించింది.
⇒ హెచ్‌ఎండీఏ పరిధిలోని నియోపోలీస్ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు గండిపేట మండలం కోకాపేటలో శారద పీఠానికి చెందిన స్థలాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజీ బోర్డుకు కేటాయించడంతోపాటు శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
⇒ క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నిర్మించిన దుకాణాలు వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించడంపై చర్చించింది.
⇒ డేటా సెంటర్లకి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల లోపు విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.


