ఉత్తరప్రదేశ్‌లో ‘జల సత్యాగ్రహం’ | Villagers stage jal satyagraha flagging water crisis in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌లో ‘జల సత్యాగ్రహం’

Feb 24 2026 6:14 AM | Updated on Feb 24 2026 6:14 AM

Villagers stage jal satyagraha flagging water crisis in Uttar Pradesh

తాగునీటి కొరతపై సిందూరియా గ్రామస్తుల నిరసన

సోన్‌భద్ర: మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం చరిత్ర ప్రసిద్ధం. అదే కోవలో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో సిందూరియా గ్రామ ప్రజలు ఇప్పుడు ‘జల్‌ సత్యాగ్రహ’ చేపట్టారు. గ్రామంలో తాగునీటి కొరత, ఇంటింటికీ నల్లా నీరు పథకంలో జాప్యానికి నిరసనగా ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదివారం సోన్‌ నది ఒడ్డున పెద్ద సంఖ్యలో ‘జల్‌ సత్యాగ్రహం’ నిర్వహించారు. వేసవి మొదలైనా కాకముందే నీటి సంక్షోభం తీవ్రతరమైందని వాళ్లు వాపోయారు. చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయని, తాగునీటి కోసం సుదూరాల దాకా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు.

 ‘‘కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి నల్లా ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఆశించాం. కానీ ఇప్పటికే కొరత మొదలైంది. రెండు మూడేళ్ల కిందట రోడ్లు తవ్వి పైప్‌లైన్లు వేశారు. ఇళ్లలోకి మాత్రం నల్లాలు ఏర్పాటు చేయలేదు. దాంతో మేం కలుషితమైన నదీ జలాలే వాడుకోవాల్సి వస్తోంది’’ అంటూ గ్రామస్తులు వాపోయారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చకపోతే లఖ్‌నవూకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. అయితే 90 శాతం గ్రామాల్లో నీటి కనెక్షన్లు ఏర్పాటు చేశామని యూపీ జల్‌ నిగమ్‌ ఈఈ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. ‘‘కొన్ని ప్రాజెక్టుల పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో సాధారణ సరఫరా ప్రారంభమవుతుంది’’ అని వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement