స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ప్రత్యేక న్యాయమూర్తి
సుల్తాన్‌పూర్: 2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మకు రాహుల్ తెలియజేశారు. తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతియాలన్నదే ప్రత్యర్థుల పన్నాగమని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనపై వచి్చన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఏనాడూ ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు.
మాటలతో ఇతరుల పరువుకు నష్టం కలిగించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ఫిర్యాదు చేశారని ఆక్షేపించారు. దాంతో న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ‘మీ వాదనను బలపర్చే సాక్ష్యాధారాలు సమర్పించండి’అంటూ రాహుల్‌కు సూచించింది. కోర్టు నుంచి రాహుల్ బయటకు వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ వారికి అభివాదం చేశారు. తమ నాయకుడి రాక సందర్బంగా సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్ నేతలు ‘సత్యమేవ జయతే’అని రాసి ఉన్న పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ఏమిటీ కేసు?
రాహుల్ గాంధీ 2018లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో నిందితుడైన అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నీతి నిజాయతీ అంటూ కబుర్లు చెబుతోందని విమర్శించారు. దీనిపై సుల్తాన్‌పూర్‌కు చెందిన జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదయ్యింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కోర్టు ఎదుట లొంగిపోయారు. రూ.25,000 పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.


