కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య రగడ దురదృష్టకరం
ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది.
ఎస్‌ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్‌ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది.
ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్‌ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది.
అంతకు మించి మరో మార్గం లేదు
ఎస్‌ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను ఆదేశించింది.
అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్‌లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది.
తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి
ఎస్‌ఐఆర్‌పై పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్‌లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అ
సెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.


