ఒకప్పుడు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు రిగ్గింగ్ చేయడానికి యత్నించేవారు. ఆ రోజుల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరిగేది. తదుపరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎంలు)ఆచరణలోకి వచ్చాయి. కొంత కాలం పాటు ఆ వ్యవస్థ బాగానే నడిచినట్లు అనిపించేది. అయినప్పటికీ కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేసేవారు. కానీ, రాను రాను అవి కూడా రిగ్గింగ్‌కు, అక్రమాలకు అతీతం కాదని సాక్ష్యాధారాలతో సహా సమాచారం రావడం ఆరంభమైంది.
అసలు ఎన్నికల సంఘమే ఈ తరహా రిగ్గింగ్‌కు కారణభూతమవుతున్నదన్న ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రయోగశాలగా ఎన్నికల అధికారులు కొందరు మార్చారా? అన్న అనుమానం వస్తోంది. ఇందులో ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఆంధ్ర ప్రజలు పట్టపగలు వేగంగా ఓట్లు వేయలేదట. అర్దరాత్రి వేళ యమా స్పీడ్‌గా ఓట్లు వేశారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతుంటే మనం నోరు వెల్లబెట్టాల్సిందే. గతంలో ఆయా రాజకీయ పార్టీలతో సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ మేధావి, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ దీనికి సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టడం అత్యంత ఆసక్తికరంగా ఉంది.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరిగిన అద్భుతం వెనుక తప్పుడు వ్యవహారం ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ద వైర్ అనే వెబ్‌సైట్‌కు రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. అది చదివితే కచ్చితంగా 2024 ఎన్నికలలో ఏపీలో ఏదో మోసం జరిగిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఆధారంగానే ఆయన ఈ పరిశీలన చేశారు. ఎన్నికలు జరిగిన 2024 మే 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ 68.04 శాతంగా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చిన మరో ప్రకటనలో అది 68.12 శాతంగా ఈసీ తెలిపింది. అంటే కేవలం 0.08శాతం పెరిగిందన్నమాట. ఆ తర్వాత 11.45 నిమిషాలకు ఓట్లు వేసినవారి శాతం 76.50శాతంగా ఈసీ చెప్పుకొచ్చింది.
తదుపరి మే 17వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం అది 80.66 శాతం కాగా, పోస్టల్ ఓట్లు కూడా కలిపితే అది 81.86 శాతం అయింది. ఈ రకంగా ఓట్ల శాతం అర్ధరాత్రి పెరగడంపైనే ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. సాధారణంగా సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ బూత్‌లలో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. గత అనుభవాల రీత్యా చూస్తే సాయంత్రం మహా అయితే రాత్రి తొమ్మిది, పది గంటల వరకు ఓట్లు వేస్తారేమో!. అంతే తప్ప తెల్లవారుజామున రెండు గంటల వరకు ఓట్లు వేయడం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కానీ, ఏపీలో ఇందుకు భిన్నంగా జరగడం అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు కేవలం 0.08 శాతమే ఓట్లు పెరిగాయి. అంటే దాని అర్దం పోలింగ్ బూత్‌లలో దాదాపు ఎవరూ లేరనే కదా అర్థం?. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించకూడదు కదా!. కానీ, చిత్రంగా రాత్రి 8 గంటల నుంచి 11.45 గంటల వరకు ఎనిమిది శాతంపైగా ఓట్లు వేశారట. అంతమంది ఎక్కడ నుంచి వచ్చారు?. అది నిజమే అయితే వారిని ఎలా అనుమతించారు. తదుపరి రెండు గంటల వరకు మరో నాలుగు శాతం పెరగడం ఇంకా చిత్రమే. ఈ రకంగా 12.54 శాతం ఓట్లు అంటే 51,83,249 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆధార సహితంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం మరింత అనుమానంగా మారింది.
పరకాల ప్రభాకర్ విశ్లేషించిన దాని ప్రకారం 11.45 నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు సుమారు 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అది కూడా 3500 పోలింగ్ బూత్‌లలోనే కావడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. పగలు నిమిషానికి ఒక ఓటు చొప్పున పడితే, అర్ధరాత్రి వేళ ప్రతీ 20 సెకండ్లకు ఒక ఓటు పోల్ అయిందని లెక్కలు చెబుతున్నాయి. అందులో వీవీప్యాట్ స్లిప్‌లకు 14 సెకండ్లు పోతే మిగిలేది ఆరు సెకన్లన్నమాట. ఇంత తక్కువ సమయంలో ఓట్లు వేయడం అసాధ్యం అన్నది తెలిసిందే. ఈ బూత్‌లలో అర్ధరాత్రి వేళ సుమారు 490 మంది ఉన్నారన్న మాట. మొత్తం మీద ఈ అదనపు ఓట్లను 175 నియోజకవర్గాలకు పంచితే అది ఒక్కో స్థానంలో 29,618 ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యాయన్నమాట. ఇవన్నీ పోలింగ్ అధికారుల సమక్షంలోనే జరిగాయా? అప్పుడు అక్కడ ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు?. వారు ఉన్నారా?. లేక వెళ్లిపోయాక ఈ మాయ జరిగిందా?. ఇది ఈవీఎంల మహిమగానే కనిపిస్తోందన్నది మేధావుల భావనగా ఉంది.
రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు ఉంటాయి. కానీ, 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిశోధనలలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి తోడు ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, కొన్ని ఈవీఎంలను తిరిగి లెక్కించాలని, వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపించాలని, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ తగ్గకపోవడానికి కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ చెందిన కొందరు నేతలు హైకోర్టుకు వెళ్లినా సరైన న్యాయం దక్కలేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్నది బలమైన భావనగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కుట్రలు జరిగి ఉండవచ్చని కొందరు సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు. 2019లో ఆయన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో ఎలాంటి పరీక్షలకైనా సిద్దమేనని ఈసీ తెలిపింది. కానీ, ఈసారి ఈసీ సరైన సమాధానమే ఇవ్వడం లేదు.
ఈ ఎన్నికలు జరిగిన పది రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్‌లను దగ్దం చేయడం, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఓడిపోయిన అభ్యర్ధులు అడిగినా ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం కచ్చితంగా మరిన్ని డౌట్లకు తావిచ్చింది. నిజంగా అర్ధరాత్రి వేళ 3500 బూత్‌లలో ఒక్కో చోట సగటున సుమారు 490 మంది ఉండి ఉంటే దాని తాలూకూ ఫుటేజీ అభ్యర్ధులకు చూపించి ఉండవచ్చు. ఇందులో ఓటర్ల భద్రతకు వచ్చే ముప్పు ఏమిటో తెలియదు. నిర్దిష్ట విధానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏభై లక్షల మంది అదనంగా ఓట్లు వేసి ఉంటే అందులోనూ అర్ధరాత్రి 17 లక్షల మంది ఓట్లు వేసి ఉంటే మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలని కొందరు లెక్క గడుతున్నారు.
ఎన్నికల కమిషన్‌కు చిత్తశుద్ది ఉంటే, రిగ్గింగ్ జరగలేదన్న నమ్మకం ఉంటే పోటీ చేసిన అభ్యర్ధి ఎవరు కోరినా వారికి వివరణ ఇచ్చి ఉండాలి. అవసరమైన వీడియో ఫుటేజీలు ఇచ్చి ఉండాలి. అలా చేయడానికి నిరాకరిస్తుడటంతో ఎన్నికల వ్యవస్థపై సంశయాలు బలపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. అసలే ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ప్రజలు బాధపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కూడా అందులో భాగమైతే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


