తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి | Ambati Rambabu Fires On Chandrababu Government Over Attack On His Residence, Questions About Police Role, More Details Inside | Sakshi
Sakshi News home page

తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి

Feb 20 2026 11:56 AM | Updated on Feb 20 2026 1:03 PM

Ambati Rambabu Fires On Chandrababu Government

సాక్షి, గుంటూరు: తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్‌ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. గూండాలు 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

‘‘పోలీసులు, గూండాలు ఏకమై దారుణంగా ఇంటిపై దాడి చేశారు. ఆ మాట అనడాన్ని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.. నేను బాధపడ్డాను. టీడీపీ నేతలు తిడుతున్నారనే ఉద్దేశంతో మాట అన్నాను. బ్యాచ్‌లుగా బ్యాచ్‌లుగా నా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. పోలీసులు సాక్షిగానే నా ఇంటి మీద దాడి చేశారు. నాలుగు గంటల పాటు నా ఇంటి మీద కరాళ నృత్యం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు.

..నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్‌లో పెట్టారు. నా అల్లుళ్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కమ్మ సామాజిక వర్గాన్ని నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్‌లో పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు?’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు.

..31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. కానీ చించివేయలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చేయమని పార్టీ పిలుపు ఇచ్చింది. పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు.

..నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఐదు గంటలకు నా ఇంటివద్దకు పలు నియోజకవర్గాలనుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటల పాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా? ఇది ధర్మమేనా? వైఎస్సార్‌సీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్పాను.

..ఇంత దారుణం.. అన్యాయం జరిగితే స్పందించరా? పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో పెట్టారు. రాత్రి 2గంటలకు స్టేషన్‌పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో కమ్మవారిని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పశ్చాత్తాప పడ్డా. పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడ లేదా?  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు.

..నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా. నా కొడకా అంటే అర్థం తెలుసా. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా.. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు. అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా.. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం... ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అంటూ అంబటి ప్రశ్నించారు.

‘‘చంద్రబాబుకమ్మని ప్రభుత్వానికి పవన్‌ కాపు కాస్తున్నాడు. నేను తగ్గను, చావనైనా చస్తా, తగ్గదేలేదు. నన్ను ఎమిలినేట్‌ చేయాలని రెడ్‌బుక్‌లో రాసుకున్నారట. చంపేస్తే సమాధి అయ్యి సాధిస్తా. పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటే లోకేష్‌కు వచ్చింది’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement