breaking news
judicial officers
-
ఎస్ఐఆర్ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది. అంతకు మించి మరో మార్గం లేదు ఎస్ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను ఆదేశించింది. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్‌లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్‌లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. -
న్యాయాధికారులూ.. ఏఐతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు. అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు. ‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం ‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు. -
కేసులు ఎత్తేయండి.. హెచ్‌సీయూ విద్యార్థులపై భట్టి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సమాజ ప్రతినిధులు కూడా వారితో సమావేశమై పలు డిమాండ్లు ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పోలీసు పహారా తప్పనిసరి పౌర సమాజ ప్రతినిధులు, యూహెచ్‌టీఏ ప్రస్తావించిన పలు అంశాలు, డిమాండ్లపై మంత్రుల ఉప కమిటీ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాల ఉప సంహరణ కోసం హెచ్‌సీయూ వీసీకి లేఖ రాస్తామని హామీ ఇచి్చంది. విద్యార్థులు, హాస్టళ్ల భద్రతకు సంబంధించి వీసీ హామీ ఇస్తే బలగాలను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే వివాదానికి కేంద్ర బింధువుగా ఉన్న 400 ఎకరాల్లో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించేందుకు పోలీసు పహారా తప్పనిసరి అని పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తెలిపారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, అయితే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని చెప్పారు. అయితే విద్యార్థులపై కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీసు, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. డిమాండ్లు అంగీకరిస్తేనే జేఏసీ నేతలు వస్తారు: యూహెచ్‌టీఏ మంత్రుల సబ్ కమిటీని కలిసిన యూనివర్సిటీ అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని యూహెచ్‌టీఏ, పౌర సమాజ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్లు సౌమ్య, శ్రీపర్ణ దాస్, భంగ్యా భూక్యా, పౌర సమాజ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, వి.సంధ్య, కె.సజయ, ఇమ్రాన్ సిద్దికీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్‌గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్‌లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
ఆ జడ్జీల సీనియారిటీని పరిగణించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమితులైన జ్యుడీషియల్ ఆఫీసర్లకు నేరుగా నియమితులైన ఇతర న్యాయమూర్తుల్లాగా సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కోరే హక్కు లేదని, వారి నియామకాలు తాత్కాలికమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతుల విషయమై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు జ్యుడీషియల్ ఆఫీసర్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫాస్ట్‌ట్రాక్ జడ్జీల నియామకాలు కొన్ని నిబంధనలకు అనుగుణంగా జరిగాయని, సాధారణ నియామకాలకు వీటికి తేడా ఉందని తీర్పులో వెలువరించింది. ఈ స్కీమ్ వల్ల పిటిషనర్లు పదోన్నతి పొందారని, దీని వల్ల వారికి లబ్ధి జరిగిందని కోర్టు తెలిపింది. వారు ఈ పోస్టుల్లో కొనసాగుతున్న సమయంలోనే సాధారణ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడితే వీరిని పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రత్యక్షంగా నియమితులైన వారికి, జ్యుడీషియల్ ఆఫీసర్ల మధ్య ఇలాంటివి ఎడతెగని వ్యవహారాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
హైకోర్టు అనుమతి లేకుండా సెలవు తీసుకోవద్దు!
హైదరాబాద్: న్యాయాధికారుల సెలవులకు సంబంధించి జిల్లా జడ్జీలు, మెట్రోపాలిటన్ జడ్జీల అధికారాలను బుధవారం హైకోర్టు ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతి తీసుకోకుండా ఏ న్యాయాధికారి సెలవు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా సెలవు కోరితే ఆ న్యాయాధికారుల సెలవు దరఖాస్తులు కోర్టుకు మెయిల్ చేయాలని రెండు రాష్ట్రాల న్యాయాధికారులను హైకోర్టు ఆదేశించింది. -
ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం నేడు
- హాజరుకానున్న సుప్రీం న్యాయమూర్తులు సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల(రాష్ట్రస్థాయి) సమావేశం శనివారం ఉదయం ప్రారంభమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం హైకోర్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఇందులో సెంట్రల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ (సీపీసీ) కె.నరసింహాచారి, రిజిష్ట్రార్ (ప్రొటోకాల్) పి.వి.రాధాకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే దిశగా అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమావేశంలో న్యాయాధికారులకు దిశా నిర్దేశం చేయబోనున్నారని మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ప్రతి మూడు, నాలుగేళ్లకు ఓసారి న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2006లో సమావేశం జరిగిందన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే చొరవతోనే ఈ సమావేశం జరుగుతోందన్నారు. సత్వర న్యాయం అందించే దిశగా.. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చిస్తారని మానవేద్రనాథ్రాయ్ వివరించారు. సత్వర న్యాయాన్ని మాటల్లో కాక ఆచరణలో చూపాలన్న లక్ష్యాన్ని సాధించేందుకే ఈ సమావేశం జరుగుతోందని తెలిపారు. తాత్కాలిక సీజే జస్టిస్ బొసాలే బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై దృష్టి సారించారని, అందులో భాగంగానే హైకోర్టులో మధ్యవర్తిత్వ శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే పేరుకుపోయిన పాత కేసు సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. పెండింగ్, బ్యాక్లాగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఏసీజీ పలు కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయాధికారులు సమర్పించే అత్యుత్తమ పరిశోధన పత్రాన్ని స్టడీ మెటీరియల్‌గా పరిగణిస్తామని వెల్లడించారు. సీపీసీ కె.నరసింహాచారి మాట్లాడుతూ న్యాయవాదులు, కక్షిదారుల సౌలభ్యం కోసం ఏసీజే సూచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నామన్నారు. అందులో భాగంగా కేసుల స్థితిగతులు తెలుసుకునేందుకు అండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్లు తయారు చేశామని తెలిపారు. త్వరలోనే రికార్డుల డిజిటలైజేషన్ చేయబోతున్నామని, దీని వల్ల కక్షిదారులు కోర్టు ఉత్తర్వుల కాపీల కోసం న్యాయస్థానం వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. హైకోర్టులో డిజిటల్ డిస్ప్లే బోర్డులు, సమాచార కియాస్క్‌లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని జిల్లా కోర్టులు, ప్రధాన జైళ్లను వీడియో లింకేజీ ద్వారా అనుసంధానం చేశామన్నారు.


