ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం నేడు | ap, telangana judicial officers meeting today | Sakshi
Sakshi News home page

ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం నేడు

Mar 19 2016 2:48 AM | Updated on Aug 18 2018 5:57 PM

ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల(రాష్ట్రస్థాయి) సమావేశం శనివారం ఉదయం ప్రారంభమవుతోంది.

- హాజరుకానున్న సుప్రీం న్యాయమూర్తులు
 
సాక్షి, హైదరాబాద్:
ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల(రాష్ట్రస్థాయి) సమావేశం శనివారం ఉదయం ప్రారంభమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం హైకోర్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఇందులో సెంట్రల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ (సీపీసీ) కె.నరసింహాచారి, రిజిష్ట్రార్ (ప్రొటోకాల్) పి.వి.రాధాకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కక్షిదారులకు సత్వర న్యాయం అందించే దిశగా అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమావేశంలో న్యాయాధికారులకు దిశా నిర్దేశం చేయబోనున్నారని మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ప్రతి మూడు, నాలుగేళ్లకు ఓసారి న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2006లో సమావేశం జరిగిందన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే చొరవతోనే ఈ సమావేశం జరుగుతోందన్నారు.

సత్వర న్యాయం అందించే దిశగా..
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో  చర్చిస్తారని మానవేద్రనాథ్‌రాయ్ వివరించారు. సత్వర న్యాయాన్ని మాటల్లో కాక ఆచరణలో చూపాలన్న లక్ష్యాన్ని సాధించేందుకే ఈ సమావేశం జరుగుతోందని తెలిపారు. తాత్కాలిక సీజే జస్టిస్ బొసాలే బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై దృష్టి సారించారని, అందులో భాగంగానే హైకోర్టులో మధ్యవర్తిత్వ శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే పేరుకుపోయిన పాత కేసు సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. పెండింగ్, బ్యాక్‌లాగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఏసీజీ పలు కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు.

ఈ సమావేశంలో న్యాయాధికారులు సమర్పించే అత్యుత్తమ పరిశోధన పత్రాన్ని స్టడీ మెటీరియల్‌గా పరిగణిస్తామని వెల్లడించారు. సీపీసీ కె.నరసింహాచారి మాట్లాడుతూ న్యాయవాదులు, కక్షిదారుల సౌలభ్యం కోసం ఏసీజే సూచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నామన్నారు. అందులో భాగంగా కేసుల స్థితిగతులు తెలుసుకునేందుకు అండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్లు తయారు చేశామని తెలిపారు. త్వరలోనే రికార్డుల డిజిటలైజేషన్ చేయబోతున్నామని, దీని వల్ల కక్షిదారులు కోర్టు ఉత్తర్వుల కాపీల కోసం న్యాయస్థానం వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. హైకోర్టులో డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, సమాచార కియాస్క్‌లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని జిల్లా కోర్టులు, ప్రధాన జైళ్లను వీడియో లింకేజీ ద్వారా అనుసంధానం చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement