బెంగళూరు: గత ఏడాది జూన్ నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాటి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ దయానందతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొనసాగుతున్న శాఖాపరమైన విచారణను ప్రభుత్వం ముగిస్తూ, వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్దారు. ఘటన జరిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించి, బాధ్యులని భావించిన కమిషనర్ బి. దయానంద, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ వికాస్, నాటి డీసీపీ (సెంట్రల్) శేఖర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా సంబంధిత అధికారులు సమర్పించిన వివరణలు, పరిపాలనా విభాగం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారిపై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యమే ప్రధాన బాధ్యత వహించాలని పేర్కొంది. అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమం నిర్వహించడం, జనసమూహాన్ని అదుపు చేయడంలో విఫలమవ్వడం వంటి లోపాలను ప్రభుత్వం ఎత్తిచూపింది. ఈ దుర్ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


