డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్? | Who is Kaiynaat Dhar reportedly getting engaged to Parth Pawar | Sakshi
Sakshi News home page

పార్థ్‌ పవార్‌తో కైనత్ ధర్ నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?

Jul 13 2026 4:39 PM | Updated on Jul 13 2026 4:48 PM

Who is Kaiynaat Dhar reportedly getting engaged to Parth Pawar

కైనత్ ధర్‌

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి సునేత్ర‌ పవార్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆమె పెద్ద కుమారుడు, రాజ్యసభ సభ్యుడు పార్థ్ ప‌వార్ పెళ్లి చేసుకోబోతున్నారు. మోడల్, వ్యాపారవేత్త కైనత్ ధర్‌ను ఆయ‌న వివాహ‌మాడ‌నున్నారు. జులై 29న పుణెలో వీరిద్ద‌రి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో పవార్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప‌వార్ ఫ్యామిలీలోకి కోడ‌లిగా అడుగుపెట్ట‌బోయే కైన‌త్ ధ‌ర్ గురించి తెలుసుకునేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు.

ఎవరీ కైనత్ ధర్?
కైనాత్ ధర్ ఇప్పటి వరకు బాహ్య ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌దు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె మోడల్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే తన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మోడలింగ్ రంగంలో చేసిన ప్రాజెక్టులు, వ్యాపార కార్యకలాపాలు లేదా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పవార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు
పార్థ్ పవార్, కైనత్ ధర్ (Kaiynaat Dhar) బంధం గురించి కొంత‌కాలంగా ప్ర‌చార మాధ్య‌మాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మ‌హాకాళేశ్వ‌ర్ ఆలయాన్ని పార్థ్‌తో కలిసి కైన‌త్‌ సందర్శించిన ఫొటోలు వైరల్ కావ‌డంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ వేడుకల్లో కైనత్ పాల్గొనడంతో ఊహాగానాల‌కు బ‌లం చేకూరింది. పార్థ్ కుటుంబం కష్టకాలంలో ఉన్న సందర్భాల్లో కైనత్ వారి వెంట కనిపించారని, ఆమెకు పవార్ కుటుంబంతో సన్నిహిత అనుబంధం చాలా కాలంగా ఉందని స‌న్నిహిత‌ వర్గాలు వెల్ల‌డించాయి.

జూలై 29న నిశ్చితార్థం
పార్థ్ పవార్, కైనత్ ధర్‌ల నిశ్చితార్థం (Parth Pawar, Kaiynaat Dhar Engagement) జులై 29న పుణెలో జరగనుంది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అతిథుల జాబితా, వేదిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

చ‌ద‌వండి: ఆ రూట్‌లో వెళ్లే వాహనాలకు టోల్‌ ఫ్రీ సౌకర్యం

అజిత్ ప‌వార్ రాజ‌కీయ‌ వార‌సుడు
మహారాష్ట్ర రాజకీయాల్లో పార్థ్ పవార్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. ఆయ‌న త‌ల్లి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆయ‌న తండ్రి అజిత్ ప‌వార్. మ‌హారాష్ట్రలో అత్య‌ధిక కాలం డిప్యూటీ సీఎంగా ప‌ని చేసిన ఆయ‌న ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో అకాల మ‌ర‌ణం చెందారు. అజిత్ ప‌వార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న స‌తీమ‌ణి సునేత్ర‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. వీరి పెద్ద కుమారుడు పార్థ్ ప‌వార్ ఈ ఏడాది ఏప్రిల్ 9న మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక‌య్యారు. త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement