పవన్‌కు ముంబైలో సర్జరీ పూర్తి | Pawan Kalyan Undergoes Successful Shoulder Surgery in Mumbai | Sakshi
Sakshi News home page

పవన్‌కు ముంబైలో సర్జరీ పూర్తి

Jul 11 2026 1:12 PM | Updated on Jul 11 2026 1:21 PM

Pawan Kalyan Undergoes Successful Shoulder Surgery in Mumbai

ఫైల్‌ ఫొటో

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్‌ కఫ్‌) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.

ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్‌ కల్యాణ్‌ రెండు భుజాల కండరాలు (రొటేటర్‌ కఫ్‌) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్‌ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.

పవన్‌ కల్యాణ్‌కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్‌ రీమేక్‌ 'గబ్బర్‌ సింగ్‌' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్‌ కఫ్‌ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్‌ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్‌ కల్యాణ్‌ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement