సాక్షి, గుంటూరు: ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలో బాబు సర్కార్ విధ్వంసకాండ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాజధాని పేరుతో అధికారులు బలవంతపు భూసేకరణకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా పచ్చటి పంటలను ధ్వంసం చేశారు.
వివరాల మేరకు.. శనివారం ఉదయం సీఆర్‌డీఏ సిబ్బంది.. జేసీబీల సాయంతో తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులు అని కూడా చూడకుండా.. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక, అంతకుముందు.. సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ పేరుతో రైతుల ఇంటికే వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లడం గమనార్హం.

బలవంతంగా రైతులను తరిమేశారు: దొంతిరెడ్డి
ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ అన్యాయమని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. చిన్నచిన్న రైతులనూ వదలకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుపమ అనే చిన్న మహిళా రైతు మీద కూడా దౌర్జన్యం చేసి భూమి లాక్కున్నారని ఆరోపించారు.
''సీడ్ యాక్సెస్ రోడ్‌కు అవసరమైతే రైతులతో మాట్లాడాలి, అలా చేయకుండా వీధిరౌడీల్లాగా అధికారులు, పోలీసులు వెళ్లారు. చిన్నచిన్న రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా? శని, ఆదివారం కోర్టులు ఉండవని ఈరోజు వచ్చి బలవంతంగా రైతులను తరిమేశారు. రాజధాని రానప్పుడే ఎకరం ఐదు కోట్లు పలికిన భూమి ఇది. అలాంటి రైతులతో మాట్లాడి సరైన న్యాయం చేయాలి. రైతులను మోసం చేసే ప్రభుత్వం ఇది. రైతుల గొంతు నులుముతోంది. ముందుగా భూములు తీసుకున్న వారికి ఏం న్యాయం చేశారు?'' అని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు.



