హైకోర్టు స్పష్టీకరణ
కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ తీర్పు రద్దు
ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలోనే ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోగలవని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం ఆస్తి పార్టీషన్ డీడ్ (విభజన పత్రం)ను రద్దు చేసే అధికారం ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌కు గానీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్‌కు గానీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఒక తీర్పును రద్దు చేసింది. కాగా ఈ చట్టం ప్రకారం ఆస్తి బదిలీ (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పాపర్టీ) విషయంలో మాత్రం ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది.
చట్టం ప్రకారం ట్రిబ్యునళ్లు ఆస్తి బదిలీని రద్దు చేయాలంటే తప్పనిసరిగా వర్తించాల్సిన అంశాలను కూడా హైకోర్టు వివరించింది. ‘చట్టం అమల్లోకి వచ్చిన తరువాత వృద్ధులు తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేసి ఉండాలి. అలాగే ఆస్తి తీసుకునే వ్యక్తి ఆస్తి బదిలీ పత్రంలో ఆ వృద్ధుల అవసరాలు తీరుస్తాననే నిబంధనను తప్పనిసరిగా పొందుపరిచి ఉండాలి. సదరు వృద్ధుల పట్ల తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆస్తిని తీసుకున్న వ్యక్తి విఫలమవ్వాలి’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.
కుమారుడిపై తల్లి ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన రామలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామమూర్తి 2018లో ఉమ్మడి ఆస్తులను విభజించుకుని ఎవరికి రావాల్సిన ఆస్తులను వారు తీసుకున్నారు. కొద్ది కాలం తరువాత తన కుమారుడు తనను సక్రమంగా చూడటం లేదని, అందువల్ల ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం రామలక్ష్మి ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
విచారణ జరిపిన ఆర్డీవో ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేసేందుకు నిరాకరించారు. దీంతో కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్‌కు రామలక్ష్మి వెళ్లారు. కలెక్టర్ విచారణ జరిపి రామలక్ష్మి కోరిన విధంగా ఆస్తి పార్టీషన్ డీడ్‌ను రద్దు చేస్తూ 2023లో తీర్పునిచ్చారు. దీనిని సవాలు చేస్తూ రామలక్ష్మి కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన భార్య, కుమారుడు, కోడలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేశారు.


