శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పెద్దలవునిపల్లి ఆర్‌ఎస్‌కే వద్ద కుప్పకూలిన కాంతమ్మ
శ్రీకాకుళం జిల్లా పెద్దలవునిపల్లి ఆర్‌ఎస్‌కేలో గంటల తరబడి నిరీక్షణ
స్లిప్పులు రాయడం, బయోమెట్రిక్.. యాప్‌లో నమోదు
అనంతరం బస్తా యూరియాతో బయటపడిన మహిళా రైతు
ఆ వెంటనే కుప్పకూలిపోయిన కాంతమ్మ
ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచిన వైనం
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో దారుణం
నందిగాం: యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి(ఆర్‌ఎస్‌కే) వెళ్లి ఓ మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. గంటల తరబడి నిరీక్షించి అసువులుబాసింది. ఈ విషాదకర ఘటన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలోని పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రంలో శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రైతు యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు ఆర్‌ఎస్‌కేకు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దీంతో పెద్దలవునిపల్లికి చెందిన పినకాన కాంతమ్మ(70) తన కుమార్తెతో కలిసి ఆర్‌ఎస్‌కేకు వెళ్లింది.
అప్పటికే పంపిణీ ప్రారంభించిన ఆర్‌ఎస్‌కే సిబ్బంది.. రైతులకు స్లిప్పులు రాయడం, యాప్‌లో నమోదు చేయడం.. డబ్బులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించిన కాంతమ్మ స్లిప్పు రాయించుకుని, బయోమెట్రిక్ వేయించుకుని ఒక బస్తా యూరియాతో బయటికొచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కన ఉన్న రైతులు సపర్యలు చేస్తూ 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా కాంతమ్మ ప్రాణాలు కోల్పోయింది. యూరియా కోసం వచ్చిన రైతులంతా ఆర్‌ఎస్‌కేలోనే ఉండటం, గది కిక్కిరిసిపోయి.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యామంటూ మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి సిగ్గుచేటు: పేరాడ తిలక్
మహిళా రైతు మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ టెక్కలి ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ హుటాహుటిన ఆర్‌ఎస్‌కే వద్దకు చేరుకున్నారు. యూరియా పంపిణీ తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లకపోవడాన్ని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఇంతటి దారుణ ఘటన చోటుచేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.


