భవిష్యత్తులో యుద్ధాలు ఊహించని రీతిలో ఉంటాయి
అందుకు సిద్ధంగా ఉండాలి
సాయుధ దళాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
సాక్షి, విశాఖపట్నం: యుద్ధాల స్వభావం వేగంగా మారుతోందని, భవిష్యత్తులో జరిగే సంఘర్షణలు ఊహించని రీతిలో ఉండొచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భవిష్యత్ యుద్ధాలకు సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత నౌకాదళంలోకి ప్రాజెక్ట్ 17ఏ కింద ఆరో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ’మహేంద్రగిరి’ యుద్ధనౌకని ప్రవేశపెట్టే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ’బారాఖానా’ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. నిన్నటి శత్రువుకు రేపటి శత్రువుకు ఎంతో మార్పు ఉంటుందని ఆయన చెప్పారు.
కొన్నిసార్లు అధికారిక ప్రకటన లేకుండానే యుద్ధాలు జరుగుతున్నాయని, అందుకే సాయుధ దళాలు శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ఆయుధాలే యుద్ధాలు గెలవలేవని, వాటిని ఉపయోగించే వ్యక్తుల సామర్థ్యమే విజయాలను నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న ప్రపంచ భద్రతా సవాళ్ల మధ్య హిందూ మహా సముద్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు భారతదేశమే ప్రధాన హామీగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


