‘సిట్‌’ మరిచిన సీసీ ఫుటేజీ! | NVR and internal memory stores vital details in Sai Krishna case | Sakshi
Sakshi News home page

‘సిట్‌’ మరిచిన సీసీ ఫుటేజీ!

Jul 11 2026 2:35 AM | Updated on Jul 11 2026 2:35 AM

NVR and internal memory stores vital details in Sai Krishna case

ఎన్వీఆర్, అంతర్గత మెమరీలో కీలక వివరాలు నిక్షిప్తం

వాటిని వెలికితీసే అవకాశం ఉన్నా పట్టించుకోని వైనం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కీలక ఆధారాల సేకరణ వైపు ‘సిట్‌’ బృందం కన్నెత్తి చూడటం లేదు. సీసీ ఫుటేజీ రికవరీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కేసు ముందుకు కదలాలంటే సీసీ పుటేజి అత్యంత కీలకమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నిందితుడు నాగరాజు గత 18 నెలలుగా పాల్పడిన దారుణాలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రణాళిక ప్రకారం డేటాను మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానంగా నెట్‌ వర్క్, వీడియో రికార్డర్‌ హార్డ్‌డిస్క్‌లను మార్చేసి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆపరేటింగ్‌ సిస్టం పనిచేసేందుకు అందులో కొద్దిపాటి ర్యాం ఉంటుంది. ఈ దృశ్యాలు ఎవరు, ఎప్పుడు తొలగించారు? అనే వివరాలు అంతర్గతంగా నిక్షిప్తం అవుతాయి. ఎన్వీఆర్‌ లాగ్‌ వీడియోలను వెలికి తీసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ద్వారా విశ్లేషిస్తే ఆ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. సాక్ష్యాధారాల సేకరణలో ఇది కీలకం కానుంది. 

అయితే సిట్‌ ఏర్పాటై రోజులు గడిచిపోతున్నా విచారణలో మాత్రం పురోగతి లేదు. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కొన్ని అరెస్టులు మినహా పెద్దగా సాధించింది ఏమీ లేదు. నిందితుల నుంచి కీలక సమాచారం ఏదీ రాబట్టలేదు. లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ, నాగరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన కాంత్రికుమార్‌ కుటుంబాలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించడంతో మేలుకున్న చంద్రబాబు సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించినా చిత్తశుద్ధి చూపడం లేదు.

మా లాయర్‌ను మార్చడంలేదు
రెండో అదనపు జ్యుడీషియల్‌ కోర్టుకు తెలిపిన సాయికృష్ణ చిన్నమ్మ 
సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసును హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యుడు, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబే వాదిస్తారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి సోదరి, అడ్వొకేట్‌ కనకదుర్గ తెలిపారు. గాదె సాయికృష్ణ కేసులో రెండో అదనపు జ్యుడిషియల్‌ కోర్టులో గాదె విజయలక్ష్మి తన న్యాయవాదిని మార్చుకున్నట్లు ఒక అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. 

తన సోదరి విజయలక్ష్మి తన కొడుకు సాయికృష్ణ కేసులో న్యాయవాదిని మార్చుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబును మార్చడంలేదని కనకదుర్గ రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్   శ్రీకాంత్‌ దృష్టికి తెచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యులు మాత్రమే తమ తరఫున వాదనలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. 

పిటిషనర్‌ గాదె విజయలక్ష్మి తన ఎదుట హాజరు కావాలని, న్యాయవాదిని మార్చుకోవడంలేదని స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆ తరువాతే ఈ కేసులో జ్యుడీషియల్, సీసీ ఫుటేజీ పరిశీలన విచారణను కొనసాగిస్తానని జడ్జి తెలిపారు. విజయలక్ష్మి ఆరోగ్య సమస్య కారణంగా రాలేదని, ఆమె తరఫున తాను హాజరైనట్లు కనకదుర్గ తెలిపారు. దీంతో జడ్జి కేసు విచారణను ఈ నెల 13కి  వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement