ఏఐ జనరేటెడ్ ఇమేజ్
సాక్షి, తిరుపతి: జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల వ్యవహారం కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టైన నిందితులు తెల్ల గుణశేఖర్ (శెట్టిపల్లి గ్రామం), ఎస్. అశ్విన్ కుమార్ (కొర్లగుంట, తిరుపతి), పడమల రాహుల్ యాదవ్ (కొర్లగుంట, తిరుపతి)గా గుర్తించారు. వీరు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఎండీఎంఏ (మెత్) డ్రగ్స్‌ను కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు డిజిటల్ వెయింగ్ మెషీన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.


