ఉత్తిపుణ్యానే రూ.1,111 కోట్ల భూ పందేరం | Government lands transferred to APTDC in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉత్తిపుణ్యానే రూ.1,111 కోట్ల భూ పందేరం

Jul 11 2026 2:30 AM | Updated on Jul 11 2026 2:30 AM

Government lands transferred to APTDC in Visakhapatnam

విశాఖలోని మధురవాడలో 9.39 ఎకరాలు ఏపీటీడీసీకి బదిలీ

పక్కా స్కెచ్‌తో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నిషేధిత జాబితా (22–ఏ) నుంచి తొలగించి మరీ కేటాయింపు

రూ.199.96 కోట్లకే బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ప్రాతిపదికగా కట్టబెట్టిన వైనం

అంటే పేపర్‌పై మాత్రమే డబ్బు బదిలీ.. సర్కారుకు రూపాయి కూడా రాదు

ఇప్పటికే ఈ భూమిలో మెగ్లాన్‌కు 5 ఎకరాలు, పద్మా హాస్పిటాలిటీస్‌కు 4.39 ఎకరాలు కేటాయింపు

స్టార్‌ హోటళ్లు, రిసార్టుల పేరుతో యథేచ్ఛగా భూ దోపిడీ

ప్రైవేటు వ్యక్తులకు నచ్చిన ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్న బాబు సర్కారు

విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి అప్పగించడంలో దూకుడు

తద్వారా యథేచ్ఛగా నాకింత–నీకింత స్కీమ్‌ అమలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ బరితెగించి ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతోంది. పెట్టుబడుల ముసుగులో ప్రైవేటు సంస్థలకు, అస్మదీయులకు పక్కా స్కెచ్‌తో అప్పనంగా దోచి పెడుతోంది. నిషేధిత జాబితాలోని (22ఏ) భూములను సైతం రాజమార్గంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ యథేచ్ఛగా భూ పందేరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములను ముందుగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు నామ మాత్రపు రేటుతో బదిలీ చేస్తోంది. 

ఇలా బదిలీ చేసే భూమికి విలువ కట్టి, ఆ మొత్తాన్ని కేవలం బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌లో చూపిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఆ తర్వాత ఏపీటీడీసీ ద్వారా ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లు, రిసార్టుల నిర్మాణాల పేరుతో లీజు ప్రాతిపదికన/అవుట్‌రేట్‌ సేల్‌కు విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలోని మధురవాడలో అత్యంత ఖరీదైన 9.39 ఎకరాల భూమిని ఏపీటీడీసీకి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) హోదాలో సీఎస్‌ సాయి ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

ఎప్పుడో కేటాయింపు.. ఇప్పుడు బదిలీ
విశాఖపట్నం మధురవాడలో భూమి విలువ ఆకాశాన్ని తాకుతోంది. ఇక్కడ 426/3 సర్వే నంబర్‌లోని 9.39 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్‌ విలువ రూ.1,111 కోట్లకు పైగా ఉంది. అయితే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు భూ బదిలీని ప్రాతిపదికగా తీసుకుని 9.39 ఎకరాలకు రూ.199.96 కోట్లుగా విలువ కట్టింది. ఇంతటి ఖరీదైన ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల రిసార్టులు, హోటళ్లకు చంద్రబాబు ప్రభుత్వం భూములిస్తూ.. తద్వారా నాకింత–నీకింత స్కీమ్‌ను నడిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గత ఏడాది డిసెంబర్‌ 13న మెగ్లాన్‌ కన్సార్టియంకు మధురవాడలో 5 ఎకరాల భూమిని, ఈ నెల 2వ తేదీన ఒడిశాకు చెందిన పద్మా హాస్పిటల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 4.39 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. తాజాగా ఈ 9.39 ఎకరాల భూమిని 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి ఏపీటీడీసీ పేరిట బదిలీ చేసింది. అంటే ఇక్కడ మెగ్లాన్, పద్మా హాస్పటాలిటీస్‌ సంస్థలకు రూ.వందల కోట్ల విలువైన భూములను ముందుగానే కట్టబెట్టిందనేది గమనార్హం.

అంతా బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌!
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పెట్టుబడుల పేరుతో భూ దోపిడీ జరుగుతోంది. ఇక్కడ పర్యాటక సంస్థ భూములనే కాకుండా ప్రైవేటు వ్యక్తులు తమకు నచ్చిన ప్రభుత్వ భూమిని ఎంపిక చేసుకుని వస్తే, ఆ భూమిని సైతం ఏపీటీడీసీకి బదిలీ చేసి తర్వాత లీజుకు/అవుట్‌రేట్‌ సేల్‌కు ఇచ్చేందుకు ఇటీవల కొత్త జీవోలు ఇచ్చింది. ఇందులో బిడ్డింగ్, టెండర్లు లేకుండానే కేవలం కాగితాలపై పెట్టుబడి ప్రతిపాదనల ఆధారంగా భూములు కేటాయిస్తోంది. వాస్తవానికి సదరు సంస్థలకు ఆతిథ్య రంగంలో అనుభవాన్ని సైతం చూడట్లేదు. 

వాస్తవ బ్రాండింగ్‌ సంస్థలతో కన్సార్టియం లేకుండా మొక్కుబడి బ్రాండింగ్‌తో వచ్చిన వారికి ఏకంగా రూ.వందల కోట్ల విలువైన భూములు ఇచ్చేస్తోంది. పైగా నోవేషన్‌ క్లాజ్‌ లేకుండా చేసి అవుట్‌రేట్‌ సేల్‌కు భూములు అమ్మేస్తోంది. తాజాగా రూ.1,111 కోట్ల విలువైన 9.39 ఎకరాల 22(ఏ) నిషేధిత భూమి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ భూమిని గతంలోనే మెగ్లాన్, పద్మా హాస్పటాలిటీస్‌కు కేటాయించగా.. తాజాగా ఆ భూమిని ఏపీటీడీసీ పేరిట బదిలీ చేసింది. 

ఇక్కడ, మొత్తం 9.39 ఎకరాల భూమికి ఏపీఎల్‌ఎంఏ (ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) రూ.1,111 కోట్లకుపైగా విలువ కడితే.. ఏపీటీడీసీకి రూ.199.96 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాలోకి రాకపోగా, ఈ మొత్తాన్ని బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌గా మాత్రమే చూపిస్తుండం ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతోంది. రూ.1,111 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల చేత్లులో దాదాపు 99 ఏళ్లు పాటు శాశ్వతంగా పెడుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement