నిలుపుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కదంతొక్కిన అంగన్‌వాడీలు
భారీ ర్యాలీలు.. ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీత
కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజం
ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు మాటేంటని ప్రశ్నల వర్షం
హెల్పర్ల పదోన్నతుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. ఫలితంగా అర్హులకు అన్యాయం
ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందనే లేదని ఆవేదన
రెండు వారాల్లో డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్
లేదంటే మరింత పెద్ద ఎత్తున కలెక్టరేట్‌లు ముట్టడిస్తామని హెచ్చరిక
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పెన్షన్ తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీలు శుక్రవారం కదం తొక్కారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఎందుకిచ్చారంటూ చంద్రబాబు సర్కారును నిలదీశారు. అఖిల భారత కోర్కెల దినంలో భాగంగా శుక్రవారం వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌ల వద్ద నిరసన తెలిపారు.
విశాఖలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించాలని, వేధింపులు ఆపాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తిరుపతిలో అంగన్‌వాడీ వర్కర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు తదితర కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్దకు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ భారీగా తరలివచ్చి మహా ధర్నాలు నిర్వహించారు.

విజయనగరంలో మానవహారం చేపట్టిన అంగన్‌వాడీలు
ఈ సందర్బంగా ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన సభల్లో ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు చంద్రావతి, నాగశేషు, లక్ష్మీదేవి, ఎన్‌సీహెచ్ సుప్రజ, వాణీక్షి, అన్నపూర్ణ, రమాదేవి తదితరులు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాజకీయంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీలకు సుప్రీం కోరు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన టీడీపీ
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం దారుణమన్నారు. హెల్పర్ల పదోన్నతుల్లో రాజకీయ జోక్యం వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇచ్చినా.. స్వయంగా కలిసి విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్పర్ ప్రమోషన్లలో రాజకీయ జోక్యం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, టీడీపీ సిఫార్సు చేసిన వారికే ప్రమోషన్లు వస్తున్నాయని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న 164 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెండు వారాల్లో సానుకూలంగా స్పందించి, తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టరేట్‌లను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు.

హోరెత్తిన జిల్లా కేంద్రాలు
» సీఎం చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు పట్టు పడితే తాడో పేడో తేల్చుకునే వరకు పోరాటం ఆపరని విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు హెచ్చరించారు. అంగన్‌వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలను కూలగొట్టే సత్తా ఉందని, అందుకే వారితో పెట్టుకోవద్దని హితవు పలికారు.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో నినదిస్తున్న అంగన్‌వాడీలు
» మచిలీపట్నంలో అడ్డుకోవడంతో అంగన్‌వాడీలు, పోలీసుల మధ్య కొద్దిసేపు తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
బందరులో బారికేడ్లతో అంగన్‌వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు..
» ఏలూరులో కలెక్టరేట్ వద్ద పోలీసులకు, యూనియన్ నాయకులు.. అంగన్‌వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
» రాజమహేంద్రవరంలో ఏకంగా 2,500 మంది అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జోరువానను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు.

గుంటూరులో అంగన్‌వాడీ వర్కర్లను అడ్డుకుంటున్న పోలీసులు
» శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీలు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
» కడపలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది కలెక్టరేట్ గేటును ఎక్కేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. మదనపల్లెలో బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

కడప కలెక్టరేట్ వద్ద లోపలకు రాకుండా అంగన్‌వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు

కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు
» చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీలు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో ఇచ్చిన హామీలు నమ్మి.. ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు రెండేళ్లయినా పట్టించుకోవడం లేదని అంగన్‌వాడీలు మండిపడ్డారు.

ఇవీ ప్రధాన డిమాండ్లు
» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్‌వాడీలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి.
» ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.
» అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతోపాటు గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.
» మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు ఐదేళ్ల సీనియారిటీ నిబంధన రద్దు చేయాలి.
» సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌తోపాటు పని భారం పెంచే నవ చేతన యాప్‌ను తక్షణం రద్దు చేయాలి.
» పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటెనెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
» సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ ఇవ్వాలి. సూపర్‌వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.
ఫొటోలకు ఇచ్చిన పోజులు చాల్లేండన్న సీఐ
నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లి మార్కెట్ యార్డ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. భోజనానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌కు మెయిన్ గేట్ వద్ద ఆందోళన కారులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అంగన్‌వాడీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలో త్రీటౌన్ సీఐ వేణుగోపాల్ ‘ఫొటోలకు ఇచ్చిన పోజులు చాల్లేండి.. వెళ్లిపోండిక’ అనడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సీఐ అన్న మాటలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తాలూకా అర్బన్ సీఐ, టూ టౌన్ సీఐలు ఆందోళన కారులకు నచ్చజెప్పారు.


