ఎల్‌నినో కారణంగా ముఖం చాటేసిన వరుణుడు
వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం
ఊరించి ఉస్సూరుమనిపిస్తున్న వర్షాలు
జలాశయాల్లో తరిగిపోతున్న నీటి నిల్వలు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు
వ్యవసాయానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. తీవ్రమైన కరువు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. అరకొర జల్లులతో సేద్యం చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే సాగు చేసిన పంటలను సైతం నష్టపోతామని దిగాలుపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయంలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది, ఆరుద్ర కరుణిస్తే దారిద్య్రం ఉండదని అన్నదాతల నమ్మకం. ఆరుద్ర నక్షత్రంలో వర్షాలకు కురిస్తే.. వరుసగా ఆరు కార్తెలు వానలు ఉంటాయని పల్లెల్లో సామెతలు ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు అదే సమయంలో దుక్కులు సిద్ధం చేసే పనిలో రైతులు బిజీబిజీగా గడుపుతారు. కానీ, ఈ సారి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లాయి. అందులో భాగంగానే ఖరీఫ్ సాగు నెమ్మదించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. వరుణుడు ఊరించి ముఖం చాటేస్తున్నాడు. మబ్బులు కమ్ముకున్నప్పటికీ చిన్నపాటి జల్లులకే పరిమితం అవుతున్నాడు. నిత్యం భారీ వర్షాలు అని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటలను సైతం తలకిందులు చేస్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. దీంతో పంటలపై భారీ ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు ఎండిపోతున్నాయి
ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉప్ణోగ్రతలు నేపథ్యంలో పంటకు వదిలిన నీరు వెంటనే ఆవిరైపోతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలుతోపాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరిపంట సాగుచేశారు. అయితే పంటకు నీరు అందక ఎండిపోతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు.
చెరువులు సైతం నీరు లేక బావురుమంటున్నాయి.. సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న బావుల్లో ఉన్న నీటిని వరిపంటను తడుపుకోవడానికి ప్లాస్టిక్ పట్టల ద్వారా రైతులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు అవిరైపోపోతోది. ఒక్క ముచ్చివోలు గ్రామంలోనే 500 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
సూపర్ ఎల్‌నినోతో కరువు?
ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఎల్‌నినో మరింత ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శీతాకాలం నాటికి సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉన్నా యని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 ప్లస్ డిగ్రీలకు చేరుకోవడాన్నే సూపర్ ఎల్‌నినో అంటారని వివరిస్తున్నారు.
పడిపోతున్న నీటి నిల్వలు
తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాలు లేక అడవుల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేక పోవడంతో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. కల్యాణీ, తెలుగుగంగ, కండలేరు, స్వర్ణముఖి, నీవా నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అదే విధంగా చెరువుల్లో నీరు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు సాగైన పంటలు గట్టెక్కుతాయా?లేదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
అయోమయంలో అన్నదాతలు
ఓ వైపు వాతావరణం అనుకూలించక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,267 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 21వేల హెక్టార్లకుపైగా సాగవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్టే జిల్లాకు 27వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది.. అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసింది కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే.
విత్తనాల గురించి అధికారులను అడిగితే.. రాలేదనే సమాధానం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 21వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేక చేతులెత్తేశారని చెప్పొచ్చు. తిరుపతి జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3,456 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు సాగైంది 1,106 హెక్టార్లు మాత్రమే. వరి సాధారణ విస్తీర్ణం కంటే.. అధికంగా సాగైనా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ప్రైవేటు ఎరువు దుకాణాల్లో యూరియా బస్తా కావాలంటే రెండు నానో డీఏపీ ప్యాకెట్లు లేదా నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.


