ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్‌మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడమే లక్ష్యం
ఇందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్, సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్
ప్రత్యేకంగా పీపీల నియామకం.. సోషల్ మీడియా జల్లెడకు ఫోరెన్సిక్ టూల్స్
మరిన్ని కేసులు, జైళ్లకు పంపడమే ధ్యేయంగా బాబు సర్కారు అడుగులు
న్యాయస్థానాల పనితీరు, కేసులు నడుస్తున్న తీరుపైనా కేబినెట్‌లో చర్చ
3 చోట్ల టీడీపీ కార్యాలయాలకు 99 ఏళ్ల లీజుపై కారుచౌకగా ప్రభుత్వ భూములు
రూ.1,800 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్ధసారథి
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి బరి తెగించి వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తన నిరంకుశ, అరాచక పోకడలను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమైంది! తన తప్పిదాలను ఎండగట్టే సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడం.. అక్రమ కేసులు బనాయించడం.. జైళ్లకు పంపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. సోషల్ మీడియాను కట్టడి చేయడమే పనిగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా, ప్రత్యేకంగా చర్చించారు.
ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న వ్యక్తులు చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే సరిదిద్దుకోవడానికి బదులుగా విద్వేషంతో ఏకంగా ఆ గళాలను పెగలకుండా చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వంలోని వ్యక్తులను అవమానపరుస్తూ దాడులు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచార శాఖ మంత్రి కె. పార్ధసారధి మీడియాతో పేర్కొన్నారు.
ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారని చెప్పారు. సోషల్ మీడియా దుర్వినియోగం ఆరోపణలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు.
సమాజానికి ఒక రోగంలా మారింది..!
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ విద్వేషాలు, వ్యక్తిత్వ హననం, దాడులు చేసే వారిని గుర్తించేందుకు ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా పోలీసు శాఖను సీఎం ఆదేశించారని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఐటీ చట్టంలోని లొసుగులు, లోపాలతో తప్పించుకుంటున్నారని.. ఆ చట్ట పరిధిలో న్యాయస్థానాల పనితీరుపైన, కేసులు నడుస్తున్న తీరుపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. సోషల్ మీడియా సమాజానికి ఒక రోగంలా మారిందని, ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ కలిగిస్తోందన్నారు.
రాజకీయ ప్రత్యర్ధులను అవమాన పరిచేందుకు, ప్రజల్లోకి అబద్ధాలను తీసుకువెళ్లడానికి కొన్ని పార్టీలు, వ్యక్తులు సోషల్ మీడియాకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఆ రాజకీయ పార్టీలను, వ్యక్తులను గుర్తించారా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఎవరినీ గుర్తించలేదని, ప్రొసీజర్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకున్నామని , అందుకు అనుగుణంగా విచారణ జరిపిన తరువాత ఎవరు ఉన్నారనేది తెలుస్తుందని చెప్పారు.
మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాచార, సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత..
వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం, దుష్ప్రచారం నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం... సోషల్ మీడియా నేరాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, న్యాయపరమైన వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం లాంటి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానించి మద్దతు అందిస్తామన్నారు.
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థంగా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గం పరిశీలించాక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
పసుపు కార్యాలయాలకు పచ్చజెండా..!
» అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెందిన 2 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు ఆమోదం.
» గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో 0.50 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం.
» అనంతపురం జిల్లా రాయదుర్గంలో 50 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం.
» ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయంలో నెలకు రూ.70,000 వేతనంతో అవుట్ సోర్సింగ్‌పై కెమెరామెన్ పోస్టుకు ఆమోదం.
» 2024 జూన్ 12 తర్వాత రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన యజమానులకు పదేళ్ల పాటు కౌలు చెల్లించేందుకు ఆమోదం. ఏడాదికి యాన్యుటీ మెట్ట భూములకు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంపు. జరీబు భూములకు యాన్యుటీ ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచేందుకు ఆమోదం.
» రాజధానిలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు 12 నెలల పాటు అద్దె కింద నెలకు రూ.10,000 చొప్పున చెల్లింపునకు ఆమోదం.
» ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి వచ్చే పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో రుణమాఫీ పథకానికి ఆమోదం.


