న్యూఢిల్లీ: భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ అదే బంధంలో కోపం, అనుమానం, అహంకారం ఉంటే ఏదో ఒక క్షణంలో జీవితం చీకటిగా మారుతుంది. ఒకప్పుడు జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తే ప్రాణాలు తీసే స్థితికి చేరితే అంతకంటే హృదయవిదారకమైన విషాదం ఇంకొకటి ఉండదు. అలాంటి కన్నీరు తెప్పించే ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.
నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపాడు ఓ కానిస్టేబుల్. సోమవారం తెల్లవారుజామున తూర్పు ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో దంపతులు స్కూటర్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త మనీశ్ భాటి స్కూటర్‌ను ఆపగా ఇద్దరూ దిగిన తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. భాటి తన భార్యపై కాల్పులు జరిపి ఆమెను రోడ్డుపైనే వదిలి అక్కడి నుంచి పారిపోయాడు.
రోడ్డుపక్కన మహిళ మృతదేహాన్ని దారిన వెళ్లే ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గుర్తించి వెంటనే ఆమెను తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్‌బీఎస్) ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మనీశ్ భాటి ఇటీవల తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (ఏఏటీఎస్)లో విధుల్లో చేరాడు. మృతురాలు భాటి భార్య ప్రియాంక (26)గా గుర్తించారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఈరోజు ప్రియాంక పుట్టినరోజు. నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు గాలింపు కొనసాగుతోంది.


