సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దుల్లోనూ అతడి కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో పుకార్లను నమ్మవద్దని.. అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్‌కుమార్‌పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలోని కీలక అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
మైనర్ బాలికను ఏడాది కాలంగా రాజ్‌కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెట్టాడని బాలిక తల్లి చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీ తండ్రిని చంపినట్లే.. మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం రాజ్‌కుమార్ కోర్టును ఆశ్రయించగా.. జూన్ 12న బెయిల్ లభించింది. అయితే..
బెయిల్ విచారణ సందర్భంగా రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది పలు వాదనలు వినిపించారు. మైనర్ బాలిక తండ్రి గతంలో తన వద్ద అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసు పెట్టారని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపాడు. అలాగే, తనపై వేధింపుల ఆరోపణలు చేసిన రోజు తాను అక్కడ లేనని, తన భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు కూడా వాదించాడు. ఇరువైపులా వాదనలను విన్న కోర్టు.. రాజ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ విచారణ సందర్భంగా రాజ్‌కుమార్ తరఫున కోర్టులో వినిపించిన వాదనలు, అందులో నమోదైన వివరాలు ప్రస్తుతం ఈ కేసులో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే బాలిక కుటుంబం మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది.
ఎనిమిదేళ్ల కిందట సరితను ప్రేమవివాహం చేసుకున్న రాజ్‌కుమార్.. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను వేధించగా.. భార్య సైతం అతన్ని అసహ్యించుకుని దూరం పెట్టింది. ఆపై బాలికకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆ కుటుంబం పోక్సో కేసు పెట్టింది. దీంతో జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రతీకారంతో రగిలిపోతూ.. శుక్రవారం(జులై 10వ తేదీ) రాత్రి మైనర్ బాలికను, ఆమె తల్లి, నాన్నమ్మలతో పాటు తన భార్య సరిత, ఇద్దరు బిడ్డల్ని గొంతు కోసి చంపాడు. అనంతరం.. తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగుర్ని చంపానని, తాను చనిపోతానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ నరరూప రాక్షసుడి కోసం జల్లెడ పడుతున్నారు.
ఈ కేసులో పోలీసుల వైఫల్యం కారణంగానే ఆరుగురి ప్రాణాలు పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో రాజ్‌కుమార్‌పై ఏడేళ్లలోపు నేరం కింద సెక్షన్లు నమోదు చేయడం వల్లనే సలువుగా బెయిల్ వచ్చిందని.. పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు విఫలమయ్యారని.. నిందితుడిపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు జరగ్గా.. షాబాద్ అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేయడం గమనార్హం.


