breaking news
Shabad Daivalaguda Incident
-
షాబాద్ హత్యల కేసులో కీలక పరిణామం
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్‌కుమార్ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్‌కుమార్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.సెల్ఫీ వీడియోలో ఏముంది?రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు.అలాగే రాజ్‌కుమార్ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.మృతిపై కూడా కేసు నమోదురాజ్కుమార్ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఏం జరిగింది?పోక్సో కేసు నమోదుపై కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్.. గత శుక్రవారం రాత్రి బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. కేవలం అరగంట వ్యవధిలోనే.. మొత్తం ఆరు హత్యలు చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి.. తాను చనిపోతున్నానంటూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.రెండు రోజుల వేట తర్వాత..ఆరు హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పెంజర్ల సమీపంలో అతడి మృతదేహం లభించడంతో గాలింపు ముగిసింది.కుటుంబం నిరాకరించడంతో..రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
షాబాద్ సైకో కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దుల్లోనూ అతడి కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో పుకార్లను నమ్మవద్దని.. అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్‌కుమార్‌పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలోని కీలక అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికను ఏడాది కాలంగా రాజ్‌కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెట్టాడని బాలిక తల్లి చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీ తండ్రిని చంపినట్లే.. మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం రాజ్‌కుమార్ కోర్టును ఆశ్రయించగా.. జూన్ 12న బెయిల్ లభించింది. అయితే.. బెయిల్ విచారణ సందర్భంగా రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది పలు వాదనలు వినిపించారు. మైనర్ బాలిక తండ్రి గతంలో తన వద్ద అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసు పెట్టారని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపాడు. అలాగే, తనపై వేధింపుల ఆరోపణలు చేసిన రోజు తాను అక్కడ లేనని, తన భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు కూడా వాదించాడు. ఇరువైపులా వాదనలను విన్న కోర్టు.. రాజ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విచారణ సందర్భంగా రాజ్‌కుమార్ తరఫున కోర్టులో వినిపించిన వాదనలు, అందులో నమోదైన వివరాలు ప్రస్తుతం ఈ కేసులో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే బాలిక కుటుంబం మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఎనిమిదేళ్ల కిందట సరితను ప్రేమవివాహం చేసుకున్న రాజ్‌కుమార్.. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను వేధించగా.. భార్య సైతం అతన్ని అసహ్యించుకుని దూరం పెట్టింది. ఆపై బాలికకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆ కుటుంబం పోక్సో కేసు పెట్టింది. దీంతో జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రతీకారంతో రగిలిపోతూ.. శుక్రవారం(జులై 10వ తేదీ) రాత్రి మైనర్ బాలికను, ఆమె తల్లి, నాన్నమ్మలతో పాటు తన భార్య సరిత, ఇద్దరు బిడ్డల్ని గొంతు కోసి చంపాడు. అనంతరం.. తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగుర్ని చంపానని, తాను చనిపోతానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ నరరూప రాక్షసుడి కోసం జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కారణంగానే ఆరుగురి ప్రాణాలు పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో రాజ్‌కుమార్‌పై ఏడేళ్లలోపు నేరం కింద సెక్షన్లు నమోదు చేయడం వల్లనే సలువుగా బెయిల్ వచ్చిందని.. పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు విఫలమయ్యారని.. నిందితుడిపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు జరగ్గా.. షాబాద్ అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేయడం గమనార్హం. -
దైవాలగూడ ఘటన: భగ్గుమన్న షాబాద్.. ఎస్ఐపై వేటు
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడు రాజ్‌కుమార్ ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆందోళన చేస్తున్న గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ కీలక ప్రకటనలు చేశారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేశ్‌ను సస్పెండ్ చేశామని, దర్యాప్తులో ఎవరిపై బాధ్యత తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే హత్యాకాండలో ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. అంతకు ముందు.. ఈ ఉదయం బాధిత బాలిక బంధవులు, గ్రామస్తులు హైవేపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలని.. ఆ నరరూప రాక్షసుడి సంగతి తేలుస్తామంటూ నినాదాలు చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లను పెట్టి.. పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని.. అరెస్టై రెండు నెలలు తిరగకముందే నిందితుడిని వదిలేశారని ఎస్సైపై గ్రామస్తులు ఆరోపణలు గుప్పించారు. ఒకానొక టైంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేకు చేదు అనుభవంగ్రామస్తుల ఆందోళన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య.. షాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామస్తులకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఏం జరిగిందంటే..దైవాలగూడ గ్రామానికి చెందిన పార్వతి రాజ్‌కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించ సాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం స్టేషన్ బెయిల్ మీద రాజ్‌కుమార్ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు.ముందే బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు?దైవాలగూడ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. శంషాబాద్‌లో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన బాధితురాలిని రాజ్‌కుమార్ బెదిరించినట్లు తెలుస్తోంది. "మీ నాన్నను ఎలా చంపేశానో.. మిమ్మల్నీ అలాగే చంపేస్తా"** అంటూ రాజ్‌కుమార్ గతంలోనే బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపించారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈ మారణహోమం జరిగేది కాదని, ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పరారైన కారు గుర్తింపు..మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు అతను ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారు వదిలేసి సమీప రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అతడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు కారు రెంట్‌కు ఇచ్చిన ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేతల అరెస్టులుఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దైవాలగూడకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలకు పోలీసులు చేవెళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిలు ఉఉన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్‌రెడ్డిలను శంకర్పల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో షాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒకవైపు గ్రామస్తుల ఆందోళనలు, మరోవైపు పోలీసులపై తీవ్ర ఆరోపణలు, ఇంకోవైపు ప్రతిపక్ష నేతల అరెస్టులతో **షాబాద్ హత్యాకాండ** రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టుకోవడంపై, అలాగే పోలీసుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది. -
దైవాలగూడలో రాక్షసక్రీడ.. ముందే హత్యాచారం!
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన సామూహిక హత్యలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్.. ప్రతీకారాన్ని అత్యంత దారుణంగా తీర్చుకున్నాడు. గంటల వ్యవధిలోనే ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యలు జరిగిన తీరు, దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పార్వతి రాజ్‌కుమార్ కారులో బాధిత బాలిక(17) ఇంటికి ఓ కారులో చేరుకున్నాడు. ఆ సమయంలో బాలికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారి మాటలను పట్టించుకోకుండా బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారులోని చెరువు సమీపానికి తీసుకెళ్లాడు.అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్లీ బాలిక ఇంటికే చేరుకున్న రాజ్‌కుమార్.. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లను కత్తితో దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. అక్కడి నుంచి రాజ్‌కుమార్ నేరుగా తన ఇంటికి వెళ్లాడు. పిల్లల కోసమంటూ..ఇంటికి వెళ్లే ముందు భార్య సరితకు ఫోన్ చేసి.. "పిల్లలను చూడాలని ఉంది" అని చెప్పాడు. దీంతో ఆమె ఎలాంటి అనుమానం లేకుండా తలుపులు తీసినట్లు సమాచారం. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకునేందుకు సరిత బయటకు పరుగెత్తినా.. వెంబడించి పట్టుకుని మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడినీ వదల్లేదు. ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రలో ఉన్న చిన్నారులు.. అలాగే బెడ్ మీద రక్తపు మడుగులో కన్నుమూశారు. పోక్సో కేసు నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను ద్వేషించడం, పిల్లల్ని దగ్గరకు రానివ్వద్దన్న ఉద్దేశంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది.పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. నిందితుడు హత్యల సమయంలో శబ్దం బయటకు వెళ్లకుండా అత్యంత వేగంగా, వరుసగా దాడులు చేసినట్లు భావిస్తున్నారు. దీంతో బాధితులకు సహాయం కోరే అవకాశం లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే ముందు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపానని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి స్విచ్చాఫ్ చేసుకున్నాడు. రాజ్‌కుమార్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికీ నిందితుడు పోలీసులకు చిక్కలేదు.ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులురాజ్కుమార్ ఏడేళ్ల కిందట.. సరితను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే దైవాలగూడకే చెందిన బాలికను ఇటీవల ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు శంషాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్‌కుమార్ ఆ మెను వెంబడించి.. కలవాలని, మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడట. ఈ బెదిరింపులకు భయపడి బాధితురాల్ని కాలేజీకి పంపడం మానేశారు. అయితే పరీక్షలకు మాత్రం దగ్గరుండి ఆమె తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. తల్లి రక్షించుకుంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి బాధిత బాలిక తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే 16న పోక్సో కేసు నమోదు కాగా.. మే 26న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేసిన పోలీసులు.. కేవలం రూ.20,000 పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్‌పై గతంలోనూ ఓ భూవివాదంలో కేసు నమోదైందని తెలుస్తోంది. ఆ కేసులో ఇద్దరిపై దాడి చేశాడని అభియోగం నమోదు అయ్యింది.ఆ విషయంపై స్పష్టత లేదు: సీపీ జోషిదైవాలగూడ సామూహిక హత్యలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక వివరాలు వెల్లడించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి, తాను కూడా చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదనే అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. రాజ్‌కుమార్‌పై పోక్సో కేసుతో పాటు గతంలో మరో కేసు కూడా నమోదైందని ధృవీకరించారు. బాధిత బాలిక తండ్రి మరణంలోనూ రాజ్‌కుమార్ పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ జరిపామని, అయితే ఇప్పటివరకు అందుకు ఆధారాలు లభించలేదన్నారు. భార్య, ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ఆరు హత్యలను రాజ్‌కుమార్ ఒక్కడే చేసినట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు.పోక్సో కేసులో నమోదైన కక్షే ఈ మారణహోమానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడి కదలికలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ ఘటనలో పరారీలో ఉన్న రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. "ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన ఆ రాక్షసుడు ఎక్కడ?" అన్న ప్రశ్న దైవాలగూడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సీసీటీవీ ఫుటేజ్షాబాద్ పోక్సో హత్యల ఘటనలో నిందితుడు బాలికను లాక్కెళ్లిన దృశ్యాలుదైవాలగూడలో రాత్రి 11 గంటలకు బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లిన రాజ్కుమార్బాలిక తల్లి, అమ్మమ్మను చంపి బాధితురాలిని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి… https://t.co/LWvY7DhtNE pic.twitter.com/uugkSFqnsa— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026 -
షాబాద్ ఘటన.. పోలీసులపై గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్ ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నినాదాలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టలేదని, బాధిత కుటుంబానికి ఎలాంటి భద్రత కల్పించలేదని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అతడి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.ఆరుగురి హత్యలకు షాబాద్ సీఐ, ఎస్సైల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం, పైగా రెండు నెలల్లోనే అతను బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి. దీంతో పోలీసులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో, గ్రామ పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి బెయిల్, అనంతర పరిణామాలు, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై కూడా విచారణ జరిపే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో బాధ్యతను పెంచాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్‌కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్‌ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్‌పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్‌పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్‌లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్‌లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
రంగారెడ్డి షాబాద్‌లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య
సాక్షి, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉండటం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌పై ఓ బాలికను(17) వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం అతడు బెయిల్‌పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున.. సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె పరీక్షిత్, రెండేళ్ల కుమారుడు రుద్రవాన్స్లను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి.. బాధితురాలి తల్లి చిట్యాల లక్ష్మి, నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను అదే కత్తితో కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఎత్తుకెళ్లి ఊరి శివారులో అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం గ్రామాన్ని భయాందోళనలకు గురిచేసింది.ప్రాథమిక విచారణలో పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలికను రాజ్‌కుమార్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన సామూహిక హత్యల ఘటనల్లో ఇదొకటిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో.. నిందితుడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు రాజ్‌కుమార్ తన కుటుంబాన్నిఎందుకు కడతేర్చాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


