కుంభమేళా ఏర్పాట్లకు ప్రకృతి బ్రేక్.. సాధుగ్రామ్‌కు కొత్త స్థలం! | Heavy Rains Force Major Change at Trimbakeshwar Kumbh Mela | Sakshi
Sakshi News home page

కుంభమేళా ఏర్పాట్లకు ప్రకృతి బ్రేక్.. సాధుగ్రామ్‌కు కొత్త స్థలం!

Jul 12 2026 1:24 PM | Updated on Jul 12 2026 1:40 PM

Heavy Rains Force Major Change at Trimbakeshwar Kumbh Mela

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్–త్రయంబకేశ్వర్‌లో 2027లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధువుల కోసం ఏర్పాటు చేయనున్న సాధుగ్రామ్ స్థలాన్ని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం పూర్తిగా నీటమునిగి, బురదమయంగా మారడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తైన ప్రాంతంలో కొత్త స్థలాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.

త్రయంబకేశ్వర్ కుంభమేళా దేశంలోని అత్యంత పవిత్ర హిందూ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి. ఇక్కడ శైవ సంప్రదాయానికి చెందిన దశనామి అఖాడాల సాధువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరోవైపు నాసిక్‌లో వైష్ణవ సంప్రదాయానికి చెందిన సాధువులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కారణంగా ప్రతి కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు, సాధువులు తరలివస్తారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఏర్పాట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారుల నిర్మాణం, కుశావర్త తీర్థం అభివృద్ధి పనులు, సరస్సుల సుందరీకరణ వంటి ప్రాజెక్టులు మందగించాయి. ముఖ్యంగా సాధువుల నివాస శిబిరం ఏర్పాటు చేయాల్సిన స్థలం పూర్తిగా బురదమయంగా మారడంతో అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు.

దీంతో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీరు నిల్వ కాకుండా ఉండే ఎత్తైన ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తున్నారు. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసి, సాధువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పరిపాలనా వర్గాలు తెలిపాయి. 2027 సింహస్థ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాల సవాళ్లు ఉన్నప్పటికీ, కుంభమేళా ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement