మృతుల ఆత్మశాంతి కోసం నదిలో వస్తువులు ఎందుకు వేయాలి? | Madras HC proposes ban on funeral rituals in Thamirabarani | Sakshi
Sakshi News home page

మృతుల ఆత్మశాంతి కోసం నదిలో వస్తువులు ఎందుకు వేయాలి?

Jul 12 2026 11:37 AM | Updated on Jul 12 2026 12:28 PM

Madras HC proposes ban on funeral rituals in Thamirabarani

సాక్షి,చెన్నై: మత విశ్వాసాల పేరుతో జలవనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసింది. మృతుల ఆత్మశాంతి కోసం బట్టలు, చెప్పులు, ఫొటోలు, ఇతర వస్తువులను నదుల్లో వదలడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

విచారణలో న్యాయమూర్తులు.. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం నదిలో వస్తువులు పడేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. మూఢనమ్మకాల పేరుతో నదులను కలుషితం చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. నదులను పరిరక్షించేందుకు ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అయితే ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో, సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

అంబాసముద్రం తాలూకాలోని ఓ మండపానికి సంబంధించి అధికారులు చేపట్టిన తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ బి. పుగలేంధిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. తామిరబరణి నది కాలుష్య అంశాన్ని పరిశీలించింది.

విచారణలో అప్పర్ తామ్రపర్ణి సబ్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కీలక వివరాలు వెల్లడించారు. పాపనాశనం నుంచి తామిరబరణి నదీ స్నాన ఘట్టాలకు వేలాది మంది భక్తులు పూర్వీకులకు సంబంధించిన అంత్యక్రియల ఆచారాల కోసం వస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా మరణించిన వారికి సంబంధించిన వాడిన, వాడని దుస్తులు, తువ్వాళ్లు, చెప్పులు, ఇతర వస్తువులను నదిలో వదులుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆది అమావాస్య వంటి సందర్భాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని వివరించారు.

స్థానిక అధికారులు, ఆలయ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద కార్యకర్త మూర్తి కోర్టుకు పలు వివరాలు తెలిపారు. నదిలో పడేసిన దుస్తులు నదీ గర్భంలో చిక్కుకుపోయి, ఈ-కోలి వంటి బ్యాక్టీరియా వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

తామ్రపర్ణి నది జలాల స్వచ్ఛతపై సి. కళావల్లి రచించిన పుస్తకంలోని వివరాలను కూడా ధర్మాసనం పరిశీలించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం, మే 7 నుంచి మే 28 మధ్య కాలంలో నది నుంచి భారీ మొత్తంలో వ్యర్థాలను సేకరించారు. 86 నుంచి 90 టన్నుల వరకు దుస్తులు, 2.2 టన్నుల భస్మం (విభూతి), 115 కిలోల పాదరక్షలు,1,385 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, 220 కిలోల గాజు సీసాలు, 700 కిలోల కాల్చిన ఇటుకలు, 374 కిలోల శానిటరీ నాప్‌కిన్లు, డైపర్లు 302 కిలోల నూనె సీసాలు, షాంపూ కవర్లు ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి.

ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు, కోర్టు ఇవ్వబోయే ఆదేశాలను ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై మతపరమైన సంస్థలు లేదా ఇతర వర్గాలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement