సుప్రీంకోర్టులో సీఎం విజయ్‌కు భారీ ఊరట | Supreme Court's Key Remarks on CM Vijay in Karur Stampede Case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో సీఎం విజయ్‌కు భారీ ఊరట

Jul 7 2026 12:34 PM | Updated on Jul 7 2026 12:58 PM

Supreme Court's Key Remarks on CM Vijay in Karur Stampede Case

ఢిల్లీ: కరూర్‌ తొక్కిసలాట ఘటన కేసులో తమిళనాడు సీఎం విజయ్‌కు ఊరట దక్కింది. కరూర్ తొక్కిసలాటపై బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్, రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జునతో పాటు ఇతర టీవీకే నేతలను నిరోధించాలని కోరుతూ తమిళనాడు డీఎంకే జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించింది.

డీఎంకే జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్‌ భారతి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 

కరూర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సీఎం విజయ్‌ పేరు ఎక్కడా నిందితుడిగా లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలి. ఏం మాట్లాడాలి అనే విషయాలను కోర్టులు నియంత్రించలేవు అని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానాలను రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చవద్దని డీఎంకే తరపు న్యాయవాదులకు కోర్టు హితవు పలికింది. కోర్టు వైఖరితో డీఎంకే తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.  

గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే, జూలై 10, 11 తేదీల్లో సీఎం విజయ్ కరూర్‌లో పర్యటించి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించనున్నారు.

బాధితులే ఈ కేసులో కీలక సాక్షులని, సీఎం విజయ్ పర్యటన వల్ల సీబీఐ విచారణ ప్రభావితం అవుతుందని డీఎంకే తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. కానీ కోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో సీఎం విజయ్ కరూర్ పర్యటనకు, బాధితుల కుటుంబాలను కలవడానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement