పహల్గామ్‌పై ప్రకృతి దాడి.. పర్యాటకుల తరలింపు! | Cloudburst in Pahalgam Water Enters Hotels | Sakshi
Sakshi News home page

పహల్గామ్‌పై ప్రకృతి దాడి.. పర్యాటకుల తరలింపు!

Jul 12 2026 9:30 AM | Updated on Jul 12 2026 9:30 AM

Cloudburst in Pahalgam Water Enters Hotels

పహల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న పలు హోటళ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే, పర్యాటకులందరూ సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే రాత్రి 8:00 నుంచి 9:00 గంటల మధ్య ఒక్కసారిగా వరద ముంచెత్తింది. పహల్గామ్‌లోని రావూరా, దేహ్‌వాథూ అటవీ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం సంభవించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఈ భారీ వర్షం కారణంగా స్థానిక వాగు ఉధృతంగా ప్రవహించి, బట్‌కుట్ వద్ద లిద్దర్ వాగులో కలిసింది. వరద నీరు కనీసం 3 నుంచి 4 హోటళ్లు, కొన్ని ఇళ్లలోకి చొరబడింది. హోటళ్లలోకి నీరు చేరిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శేషనాగ్, లిద్దర్ వాగుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇవి ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే దిగువనే ప్రవహిస్తున్నప్పటికీ, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 

దోడా జిల్లాలోనూ ఆకస్మిక వరదలు
ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు థాత్రి పట్టణ ఎగువ ప్రాంతం ఆకస్మిక వరదల బారిన పడింది. ఈ వరద ధాటికి పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రాళ్లు, బురద, వ్యర్థాలు కొట్టుకువచ్చి థాత్రి పట్టణంపై పడ్డాయని అధికారులు తెలిపారు. బురద, బండరాళ్లు ఇళ్లు, దుకాణాలను ఢీకొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు బురద కింద చిక్కుకోగా, కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి చీనాబ్ నదిలో కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో థాత్రి సమీపంలో డోడా-కిష్త్వార్ రహదారి మూతపడి రవాణా నిలిచిపోయింది. జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఇతర సహాయక సంస్థలతో కలిసి రహదారిని పునరుద్ధరించేపనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement