డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ | Bengaluru Woman Says Delivery Agent Incident In Social Media | Sakshi
Sakshi News home page

డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ

Jul 12 2026 8:00 AM | Updated on Jul 12 2026 8:06 AM

Bengaluru Woman Says Delivery Agent Incident In Social Media

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళకు డెలివరీ ఏజెంట్ కారణంగా భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరగా, మహిళ అందుకు నిరాకరించింది. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా అతడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. సాధారణ డెలివరీగా మొదలైన ఘటన చివరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ వెళ్లే ముందు టాయిలెట్ ఉపయోగించుకోవాలని అడిగాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆమె అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆమె వద్దని చెప్పినా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జరిగిన ఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఎదుట ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఎదుట తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె వెంటనే తలుపులు మూసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

ఈ ఘటన అనంతరం బాధితురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఆమె పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదు అందించాలని బాధితురాలిని కోరిన పోలీసులు, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా, ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందితో సంబంధం ఉన్న కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులకు ఇంట్లోకి ప్రవేశం కల్పించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement